మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition నాడు ‘విశాఖ ఉక్కు’ కోసం...

1 గంట క్రితం

Comrade
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై ద్రోహం చేసినందుకు... ‌అసెంబ్లీలో ప్రతిపక్షాలు నాటి రాష్ట్ర ప్రభుత్వంపై ఉమ్మడిగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. చర్చ అనంతరం ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌‌కు రాజీనామాలు అందచేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండు రోజుల చర్చకు సిపిఐ(ఎం) నేత తరిమెల నాగిరెడ్డి సమాధానమిచ్చారు (1966 నవంబర్‌ 17). అరగంట సాగిన ఆ ఉపన్యాసంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను నిశితంగా విమర్శించారు. ​

‘‘ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడి వుంది. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మీరు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాలాంధ్ర ఏర్పడినప్పట్నుంచీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుంది. రాష్ట్రం వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి పారిశ్రామికీకరణ అవసరమని ప్రతివారికీ తెల్సిందే. ఇందుకు ప్రభుత్వం చేసిన కృషి ఏమిటి? అని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు? ఏర్పడక పోవడానికి కారణమేమిటి? పరిశ్రమలకు అడ్డు తగులుతున్నదెవరు? పారిశ్రామికీకరణకు ప్రభుత్వం చేసిన కృషి ఏమిటి?

ఇదిగో ఫ్యాక్టరీ, అదిగో పరిశ్రమ అని ప్రజలను ఊరించారు. నిజమే కాబోలు అనుకున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మినందువల్ల కలిగిన ఫలితాలేమిటి? అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి సైతం అత్యంత అవసరమైన విద్యుత్ విషయంలో రాష్ట్రం పరిస్థితి ఏమిటి? దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా చివర వుంది మన రాష్ట్రం. దీనికి కారణం ఎవరు? ప్రజలా? ప్రభుత్వమా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. విశాఖలో డ్రైడాక్ వస్తుందన్నారు. వచ్చేసిందని చెప్పారు. దాని పరిస్థితి ఏమైంది. నిర్మిస్తామని హామీ ఇచ్చిన పరిశ్రమలే నిర్మాణం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసింది? ప్రజలకు సంయమనం బోధిస్తూ కూచుంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహించడంలేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం మెరైన్ డీసెల్ ఇంజన్ల ఫ్యాక్టరీ. ఇది కూడా మనకే వస్తుందని ఆశ పెట్టింది ఈ ప్రభుత్వం. అది కూడా మన చెయ్యి జారిపోయింది. ఎందువల్ల? ప్రభుత్వ అశ్రద్ధ? ప్రజాప్రయోజనాల నిర్లక్ష్యం మూలంగానూ.

ఈ అనుభవం ప్రజలను కుతకుతలాడించింది. ప్రజలు చక్కని గుణపాఠాలు తీసుకున్నారు. తాము కదలకుంటే ఉక్కు ఫ్యాక్టరీ కూడా పూజ్యమౌతుందని వారికి తెలుసు. అందుకు వారిలో ఆగ్రహం పెల్లుబికింది. ఆంధ్ర ప్రజల ఆశలకు గత 15 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలపై ప్రజలిచ్చిన తీర్పే ఉక్కు ఉద్యమం. ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో మీ ఆచరణ ఏమిటి? విశాఖలో 5వ ఉక్కు ఫ్యాక్టరీ తధ్యమనే ప్రకటనలు చేశారు. నిపుణుల బృందం విశాఖను ఎంపిక చేసింది. దానిపై చర్చల సందడి తగ్గింది. ఒక నెల లోపుగా విశాఖ విషయమై అనుకూల ప్రకటన రాగలదని నోరూరించారు. కాని ప్రకటన రాలేదు. అమృతరావు దీక్ష ప్రారంభించారు. ఉద్యమం ప్రజా ఉద్యమం అవుతోంది. కేంద్ర మంత్రివర్గం సబ్ కమిటీని వేసింది. ఒకసారి నిపుణుల బృందం నిర్ణయించిన విషయంపై సబ్ కమిటీ ఎందుకు? ఈ విషయంలో మీరు మీ నిరసన కేంద్రానికి తెలియజేశారా? పదకొండవ స్థానానికి కుస్తీ పట్లు తప్ప ఆంధ్ర ప్రజల ప్రయోజనాల పట్ల మీ దృష్టి లేదాయె.

ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగానే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కేంద్రం చేసిన అన్యాయానికి, రాష్ట్ర ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానమేమిటని ప్రశ్నించవచ్చు! కేంద్రం ఈ అన్యాయాలు 19 సంవత్సరాలుగా చేస్తుంటే దాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకనే మాకు ఈ ప్రభుత్వంలో విశ్వాసంలేదు. దానిలో రాజకీయాలు చొప్పిస్తున్నారని ముఖ్యమంత్రి మమ్ములను ఎందుకు నిందిస్తున్నారో రాజీనామా ఇస్తే. మీరే కదా దాన్ని రాజకీయాలకు ముడిపెట్టింది? ఆర్థిక సమస్యలున్నాయని ఆనాడే తెలుసుకదా? కాగా ఈ రోజున ఆర్థిక సమస్యలున్నాయి కాబట్టి ఉక్కు కర్మాగారం లేదని చెప్పడంలో మీ ఉద్దేశమేమిటి? ప్రజలను మోసం చేయాలని తప్ప ఆర్ధిక వనరులు లేవంటూనే ఉక్కు కోసం నాల్గో ప్రణాళికలో కేటాయింపు కూడా ప్రజలను మోసం చేయడానికే కదా? ఈ సమస్యను నానబెట్టారు. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య తంపులు పెట్టారు. పెట్టిన తరువాత, తగాదా వుంది కాబట్టి ఇవ్వం పొమ్మని అనడం బ్లాక్‌ ‌మెయిల్ తప్ప మరేమిటి?

ఏం భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, బొకారో ఉక్కు కర్మాగారాల కోసం ఉద్యమాలేవీ జరగలేదే? ఇంతకూ ఇప్పుడే ఎందుకు జరగాల్సి వచ్చింది? రాజకీయాలు ఇందులో చొప్పించబట్టే ఈ సమస్య ఏర్పడింది.

ఇలా కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రదర్శించే కన్నా కాస్త వెనక్కు తిరిగి ఆలోచించడం మంచిది. అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు లేరు. కానీ అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయే? ఏం, ఢిల్లీ పోలీసుల్లో కూడా కమ్యూనిస్టు రెడ్‌ ‌గార్డులు దూరారని ముఖ్యమంత్రి అంటారా? ఉక్కు ఉద్యమం ఆగిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఆగిపోయిన తరువాత ఈ రోజుకు కూడా వందలాది మందిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు? జైళ్లలో చిత్రహింసలకు ఎందుకు గురిజేస్తున్నారు? వీలైనన్ని సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెడుతున్నారు?

న్యాయ విచారణ జరపమంటే మీరెందుకు భయపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. చేస్తే ఈ చట్ట వ్యతిరేక హింసాకాండంతా బయటపడుతుంది. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కొద్ది కాలమే వున్నా ప్రతి సందర్భంలోనూ న్యాయ విచారణ జరిపించింది. ఒక విచారణ సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, అయినా జంకలేదు. కారణం, కమ్యూనిస్టులు సత్యానికి భయపడరు. అలా భయపడేది కాంగ్రెస్ వారే. ప్రజలు చేసినది అరాచకమని మీరంటే మీరు పెట్టిన పేరది. దానికన్నా ఎన్నో రెట్లు పోలీసు, భూస్వామ్య అరాచకం రాష్ట్రంలో సాగుతోంది. గ్రామాల్లో భూస్వాములు తుపాకులతో కాల్చి చంపుతుంటే అడ్డే వారెవ్వరూలేరు. అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌‌పై విడుదల చేస్తారు. కానీ పోతురాజు, రాజశేఖర్‌ ‌రెడ్డి తదితర ఉద్యమ కార్యకర్తలను వందలాది మందిని అరెస్టు చేసి జైళ్లలో చిత్రహింసలు, చాలా కాలం వరకు బెయిల్ నిరాకరణ... ఇది కాంగ్రెస్ మార్కు న్యాయం. నిర్మాణయుతమైన పద్ధతికి అలవాటు పడింది సిపిఐ(ఎం). అరాచకంగా ప్రవర్తించాలన్నా వారికి చేతగాదు. మీకు పరిపాలన చేతగాలేదు. ధరలను అరికట్టలేరు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్గించలేరు. అందుచేత ప్రజలు బజార్లలోకి వస్తున్నారు. మేం పిలిస్తే రావడంలేదు.

న్యాయ విచారణ జరపమని మేం అడిగాం. మీరు నిరాకరించారు. అందుచేత రాజీనామా చేయమని డిమాండ్ చేశాం. దానికి నిరాకరించారు. అందుచేతనే ఈ అవిశ్వాస తీర్మానం.’’ అని నాగిరెడ్డి తన ప్రసంగం ముగించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం...ముఖ్యమంత్రి సమాధానం తరువాత జరిగిన ఓటింగ్‌‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శాసన సభలోని 67 మంది ప్రతిపక్ష శాసన సభ్యులు రాజీనామాలు చేశారు. నాడు, నేడు డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్లే వున్నాయి. విశాఖ ఉక్కుకు అన్యాయం జరుగుతూనే వుంది.


(‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు మహోద్యమం’ పుస్తకం నుండి కొన్ని భాగాలు)

కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి యాభయ్యవ వర్థంతి సందర్భంగా...

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్