మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైకల్య బాధితుల 'ఈజీ లైఫ్' కోసం..

53 నిమిషాల క్రితం

bindu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

జీవితాన్ని ఎలా గెలవాలో అమ్మ నేర్పినంత గొప్పగా ఏ యూనివర్శిటీ నేర్పదు. అలాంటి అమ్మ తీర్చిదిద్దిన కూతురు డాక్టర్ హిమబిందు. వైకల్యం వెక్కిరించినా అమ్మ ఇచ్చిన ఆత్మస్థైర్యంతో జీవితంలో తనకు ఎదురైన ప్రతి అడ్డంకినీ ఆమె అలవోకగా అధిగమిస్తున్నారు. డాక్టరు విద్య చదివి ప్రొఫెసర్ గా, వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైద్రాబాద్ రెయిన్ బో పిల్లల హాస్పటల్ లో ఫీటెల్‌ మెడిసన్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే హిమబిందు గురించి ఇంతవరకే చెప్పుకుంటే సరిపోదు. వైకల్యంతో నడవలేని తనలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ఆమె చేస్తున్న కృషి ఎంతో విలువైనది. భర్త ప్రోత్సాహంతో దేశంలోనే మొట్టమొదటి వీల్ ఛైర్ తయారీరంగాన్ని ఆమె ప్రారంభించారు. ‘ఈజీ లైఫ్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్` పేరుతో చిన్నగా ప్రారంభించిన ఈ మేడిన్ ఇండియా ఉత్పత్తులు స్వల్ప కాలంలోనే దేశంలోని నలుమూలలకు విస్తరించాయి.

ఒంగోలు ఆమె స్వస్థలం. ముగ్గురు సంతానంలో ఆఖరి బిడ్డ కావడంతో అమ్మ నాగేశ్వరమ్మకు బిందుతో ప్రత్యేక అనుబంధం ఉంది. బిందు గురించి చెప్పాలంటే ముందుగా అమ్మ గురించి చెప్పాల్సిందే. ఉపాధ్యాయురాలిగా, ఒంటరి తల్లిగా బిడ్డలను ప్రయోజకులను చేసిన ఎందరో తల్లులు ఆమెలో కనిపిస్తారు. పోలియోతో బిందు కాళ్లు చచ్చుబడిపోతే ఆ దుఃఖాన్ని ఆ తల్లి తన కళ్లల్లోనే ఆపేసింది. ఎప్పుడూ ఆ బాధను బిడ్డ వరకు తీసుకురాలేదు. వైకల్యం తాలూకు నిరాశ, నిస్పృహ బిడ్డ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. ఎవరినీ తన గురించి అవమానకరంగా మాట్లాడనివ్వలేదు. అంత ఆత్మవిశ్వాసాన్ని కూతురిలో నింపిన ఆ తల్లి ఇప్పటికీ తన వెన్నంటే ఉండి సేవలు చేస్తున్నారు. ఒంగోలు, కావలిలో ఉన్నత విద్య పూర్తి చేసి, తిరుపతిలో మెడిసిన్‌ చదివారు. ఉస్మానియాలో ఎండీ చేశారు. వైకల్యంతో ఉన్నత విద్య లక్ష్యాన్ని చేరుకోవడం అంత ఆషామాషీ కాదు. ఆ ప్రయాణం గురించి బిందు ఇలా చెప్పారు. 'ఏడాది వయసులో సోకిన పోలియోతో పదేళ్ల వయసు వరకు పాకుతూనే ఉన్నాను. స్కూలుకు ఎత్తుకుని తీసుకెళ్లేవారు. అన్నయ్య సైకిల్‌పై తీసుకెళ్లేవాడు. ఒక్కోసారి అక్క తీసుకెళ్లేది. తోబుట్టువులు, అమ్మ సహకారం లేకపోతే వైకల్యం నన్ను చాలా కుంగదీసేది' అని తన బాల్యాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

​7వ తరగతిలో ఉన్నప్పుడు బిందుకు మొదటి శస్త్రచికిత్స జరిగింది. అయితే తాను లేచి నడవలేనని, వీల్‌చైర్‌కే పరిమితం కావాలని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలు బిందులో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా నడవాలన్న సంకల్పంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పడుతూ లేస్తూ వెళ్లేవారు. ఏడాదిలోనే తనలో వచ్చిన మార్పు చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి కాలిపర్స్‌, క్రచెస్‌ సాయంతో నడవడం ప్రారంభించారు. వైకల్యం తనను ఇంతలా బాధిస్తున్నా చదువులో బిందు ఎప్పుడూ ముందుండేవారు.

​మెడిసిన్‌ చేయలేవు.. వద్దన్నారు..​

చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలన్నది బిందు కల. పదో తరగతి తర్వాత బైపీసీ తీసుకుంటానంటే టీచర్లు 'ల్యాబ్‌లో చాలా సేపు నిలబడాలి. చాలా కష్టంగా ఉంటుంది' అని చెప్పారు. అప్పుడు 'అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే బైపీసీ తీసుకుని మంచి ర్యాంకు సాధించాను' అని బిందు చెప్పారు. వీల్‌చైర్‌ అవసరం లేకుండా మెడిసిన్‌ వరకు చదివిన బిందు, నడుస్తూ పడిపోవడంతో ఒకసారి భుజానికి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు వీల్‌చైర్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. అప్పటి వరకు బిందు జీవితం ఒకలా ఉంటే, వీల్‌చైర్‌కు మారిన తర్వాత మరో మలుపు తిరిగింది. వైద్యురాలిగా సేవలందించాలనుకున్న ఆమె, వైకల్యం కారణంగా అనాటమీ ప్రొఫెసర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం మెటర్నల్‌ అండ్‌ ఫీటల్‌ మెడిసిన్‌లో పీజీ డిప్లోమా చేశారు. బార్సిలోనా నుంచి ఫీటల్‌ మెడిసిన్‌, ఎఫ్‌ఎంఎఫ్‌ యూకే నుంచి సర్టిఫికేట్‌ కోర్సులు పూర్తి చేశారు. 20 ఏళ్ల పాటు మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌గా సేవలందించారు.

​ఒక కోచింగ్‌ సెంటర్‌లో జిన్నేంద్ర సత్య శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం వివాహబంధంగా మారింది. బిజినెస్‌ అనలిస్ట్‌గా ఉన్న జిన్నేంద్ర, పెళ్లి తర్వాత బిందును అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 'అత్తగారు అచ్చిరాజు, అమ్మ, భర్త తనను చిన్నపిల్లలా చూస్తారు' అని బిందు ఎంతో గర్వంగా చెబుతారు. బిందు ప్రయాణంలో పలు సంస్థల ప్రోత్సాహం కూడా ఉంది. 2025లో ఎఫ్‌టీసీసీఐ నుంచి 'ఎక్సలెన్స్‌ ఇన్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌' అవార్డు అందుకున్నారు. 'ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఉమెన్స్‌ గ్లోబల్‌ పిచ్‌ కాంపిటీషన్‌' రీజినల్‌ పోటీల్లో కూడా బహుమతి గెలుచుకున్నారు.

​ఈజీ లైఫ్‌ ఆవిర్భావం..

​విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వీల్‌చైర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలే ఆమెను సొంత తయారీ సంస్థ వైపు నడిపించాయి. మొదట అవసరమైన వారికి డీలర్‌షిప్‌ ద్వారా వీల్‌చైర్లు అందించాలని భావించిన ఈ దంపతులు, అందులోని లోటుపాట్లను గ్రహించి తమ జీతాలను వెచ్చించి మరీ 'ఈజీ లైఫ్‌'కు అంకురార్పణ చేశారు. ​దాని గురించి బిందు మాట్లాడుతూ.. 'విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వీల్‌చైర్‌లో ఏదైనా మరమ్మతు చేయించుకోవాల్సి వస్తే చాలా కష్టపడాల్సి వచ్చేది. మెకానిక్‌లు అందుబాటులో ఉండేవారు కాదు. ఒకసారి ఎలాగోలా రిపేర్‌ చేయించుకున్న తర్వాత బ్యాటరీ పేలిపోయి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో నేను వీల్‌చైర్‌లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సంఘటనే మమ్మల్ని ఈ దిశగా ఆలోచించేలా చేసింది' అని ఆ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

​అవసరమైన వారికోసం..

​'ఈజీ లైఫ్‌' ప్రయాణం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినా బిందు దంపతులు వెనుదిరగలేదు. వైకల్యం ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వీల్‌చైర్లను రూపొందించి అందిస్తున్నారు. బరువును బట్టి కూడా వివిధ రకాల వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 15 నుంచి 20 రకాల వీల్‌చైర్లను తయారుచేస్తున్నారు. 'భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది' అని బిందు అంటున్నారు. 2019లో సంస్థ ఆలోచన ప్రారంభమైనా, 2022 నుంచే కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నాలుగేళ్లలోనే వెయ్యికి పైగా వీల్‌చైర్లను కోల్‌కతా, ముంబయి, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు సరఫరా చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటికంటే తక్కువ ధరకే అందిస్తున్నారు. మరమ్మత్తుల కోసం సర్వీస్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. సంస్థ బాధ్యతలు చూసుకోవడానికి జిన్నేంద్ర తన ఉద్యోగాన్నే వదిలిపెట్టారు. 'వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా సంతృప్తికర జీవితం అనుభవిస్తున్నా. ఒక వైకల్య బాధితురాలు ఇంత సాధించిందంటే, దానికి నా కుటుంబమే కారణం' అని చెప్పే బిందు ప్రయాణం ఎందరికో ఆదర్శం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్