ఈ రోజుల్లో బూర్జువా సిద్ధాంతం అన్ని చోట్లా ఎంత బలంగా వ్యాపించిందంటే సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని కోరుకునేవాళ్ళు సైతం ఆ సోషలిజం గురించి చాలా పొరపాటు భావాలను వ్యక్తం చేస్తున్నారు. అందుచేత మళ్ళీ ఇంకొకసారి ఈ మౌలిక అంశం గురించి చర్చించడం అవసరమే. మామూలుగా సోషలిజం అంటే ఆ వ్యవస్థ ప్రధాన లక్షణం ఉత్పత్తి సాధనాలు సమాజపరం అయివుండడం, సమాజానికి ప్రతినిధిగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండడం అని భావిస్తారు. ఈ లక్షణం తప్పనిసరిగా ఉండవలసినదే. కాని అది మాత్రమే సరిపోదు. ఉదాహరణకు గతంలో ఉండిన యుగోస్లేవియానే తీసుకోండి. ఆ దేశంలో ఉత్పత్తి సాధనాలు అత్యధికంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉండేవి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే చాలా లక్షణాలు - నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలు (వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య కూడా) ఉండేవి (అయితే ప్రస్తుతం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ''సాధించినంత ఘనమైన స్థాయిలో'' మాత్రం ఉండేవి కావు). అదే సమయంలో, ఫ్రాన్స్ వంటి పెట్టుబడిదారీ దేశాల్లో గణనీయంగా ప్రభుత్వ రంగం ఉండేది. దానిని బట్టి ఫ్రాన్స్‌ను సోషలిస్టు దేశంగా జమ కట్టలేం. అందుచేత సోషలిజం అంటే కేవలం ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ యాజమాన్యం కింద, లేదా సమాజపరమై ఉండడం అనేదానిని మించి మరేదో ఉండాలి.
ఆర్థిక వ్యవస్థను నిర్వహించేవారి నడుమ (ఉత్పత్తిదారుల మధ్య) పోటీని ప్రోత్సహించడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ మౌలికంగా చేస్తుంది. ఆ పోటీ పెట్టుబడిదారులు సంపదను పోగు చేసుకోడానికి పూనుకునేట్టు చేస్తుంది. పోటీలో నిలదొక్కుకోవాలంటే తాజా పరిశోధనలను ఉపయోగించి కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి ప్రవేశపెట్టగలగాలి. అదే సమయంలో కార్మికుల మధ్య పోటీ నెలకొని వుండేలా చూడాలి (తమ మధ్య పోటీ లేకుండా ఉండేందుకే కార్మికులు ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారు. పెట్టుబడిదారులు ఆ యూనియన్లను దెబ్బ తీయడానికో, బలహీనపరచడానికో అనునిత్యమూ ప్రయత్నిస్తూనే వుంటారు.). సోషలిజం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందులో ఆర్థిక వ్యవస్థను నిర్వహించేది కార్మికులు. వారి నడుమ సహకారం నెలకొనేట్టు సోషలిజం అన్నివేళలా ప్రయత్నిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇటువంటి సహకారం అసాధ్యం. అందులో ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల చేతుల్లో ఉండడం వలన పోటీ నెలకొన్నట్టు సహకారం పెంపొందదు. పెట్టుబడిదారులు అనే వర్గమే అదృశ్యం అయిపోయాక సోషలిజంలో సహకారం పెంపొందడం, అంటే పోటీ లేకుండా చూడడం అనేది సాధ్యపడుతుంది. యుగోస్లేవియా ''మార్కెట్ సోషలిజం'' అన్న విధానాన్ని పాటించింది. దానర్థం ఏమంటే ప్రభుత్వ యాజమాన్యం కింద నడుస్తున్నప్పటికీ, ఆ ప్రభుత్వ సంస్థలు పరస్పరం మార్కెట్‌లో పోటీ పడడం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడ్డట్టే 'మార్కెట్ సోషలిజం'లో ప్రభుత్వ సంస్థలు పోటీ పడ్డాయి. అందువల్లే యుగోస్లేవియా కొన్ని పెట్టుబడిదారీ లక్షణాలను కనపరిచింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ నడక మౌలిక లక్షణం మార్కెట్‌లో పోటీ పడడం. దాని వలన ఆ పోటీలో ఓడినవాళ్ళు అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. పోటీ వ్యవస్థ నుండి 'బయటకు' గెంటివేయబడడమే 'ఓడినవాళ్ళు' చెల్లించుకోవలసిన మూల్యం. ఈ 'బయట' ఉన్నది 'శ్రామికవర్గ రిజర్వు సైన్యం' అని మార్క్స్, ఎంగెల్స్ అన్నారు. ఈ రిజర్వు సైన్యం పెట్టుబడిదారీ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ప్రతీ ఉత్పత్తి వ్యవస్థలోనూ శ్రమజీవులు పని చేయడానికి వారికి ఏదో ఒక ప్రేరణ, ఒక కట్టుబాటు లేదా క్రమశిక్షణ అవసరం. బానిస వ్యవస్థలో ఆ బానిస కూడా యజమాని స్వంత ఆస్తి గానే ఉంటాడు. కనుక శారీరకంగా కొట్టి, హింసించి వాళ్ళ చేత పని చేయించడం, కట్టుబాటులో ఉంచడం చేశారు. ఫ్యూడల్ సమాజంలో కూడా అదే మాదిరిగా భూస్వామి కొరడాకు జడిసి శ్రామికులు కట్టుబాటులో ఉండి పని చేశారు. అదే పెట్టుబడిదారీ సమాజం వచ్చేసరికి, కార్మికులపై బలప్రయోగానికి పూనుకొనేందుకు ఆస్కారం లేదు (పెట్టుబడిదారీ సమర్థకులు వల్లించే ఆదర్శాల ప్రకారం చూస్తే). మరి అటువంటప్పుడు కార్మికులు పని చేసేట్టు, క్రమశిక్షణతో వ్యవహరించేట్టు వారిని ప్రేరేపించేది ఏది? వాళ్లు అలా పని చేయకపోతే వారిని ఉద్యోగం నుండి ఊడగొడతారన్న భయమే ప్రేరణగా పని చేస్తుంది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి 'బయటకు' గెంటివేస్తారన్న భయం. అటువంటి భయం ఉండాలంటే ఒక 'వెలుపలి' భాగం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండాలి.
ఈ 'వెలుపలి' భాగం వలన మరో రెండు ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. కార్మికుల ఉత్పాదకత పెరిగినప్పుడల్లా వారి నిజ వేతనాలు పెరగకుండా అదుపు చేయడం, సృష్టించబడ్డ అదనపు విలువలో అంతకంతకూ ఎక్కువ భాగాన్ని పెట్టుబడిదారులు చేజిక్కించుకోవడం మొదటిది. వేతనాలను పెంచమని కార్మికులు కోరినప్పుడు ఆ డిమాండ్ ను నియంత్రించడం, తద్వారా డబ్బు విలువ స్థిరంగా ఉండేలా చూసుకోవడం రెండవ ప్రయోజనం. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే దానిలో ఒక 'లోపలి భాగం', మరొక 'వెలుపలి భాగం' అనే రెండూ కలిసే వుంటాయని స్పష్టం కావాలి. ఇందులో లోపలి భాగం ఎంత అవసరమో, వెలుపలి భాగం కూడా అంతే అవసరం. అప్పుడే పెట్టుబడిదారీ విధానం కొనసాగగలుగుతుంది.
ఈ వాస్తవాన్ని కేవలం మార్క్సిజం మాత్రమే గుర్తించింది. తక్కిన ఏ ఆర్థిక సిద్ధాంతమూ దీనిని గుర్తించలేదు. మార్కెట్ సమతుల్యత అనేది అన్ని మార్కెట్లలోనూ ఏర్పడుతుందని, అంటే డిమాండ్, సప్లయ్ సమానంగా ఉండే స్థితి అని, ఇది కార్మిక మార్కెట్‌కు సైతం వర్తిస్తుందని పెట్టుబడిదారీ సిద్ధాంతం చెప్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించబడుతుందని దీనర్థం. అందులో నిరుద్యోగం ఉండదు, రిజర్వు సైన్యం ఉండదు. అంటే 'వెలుపలి' భాగం అనేదే ఉండదు. కేవలం 'లోపలి' భాగం మాత్రమే ఉంటుంది. మరి అటువంటి స్థితి లో పని చేయడానికి ప్రేరణ, క్రమశిక్షణ అనేవి ఎలా గ్యారంటీ అవుతాయన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు.
ఇప్పుడు మనం పెట్టుబడిదారీ విధానానికి, సోషలిజానికి మధ్య ఉన్న కీలకమైన తేడా వద్దకు వచ్చాం. పెట్టుబడిదారీ విధానంలో కార్మికులను భౌతికంగా హింసించి వారిచేత పని చేయించే పద్ధతి లేకపోయినా, పనిలో నుంచి 'తొలగిస్తాం' అని భయపెట్టి పని చేయించే పద్ధతి ఉంది. ఉద్యోగం నుండి తొలగించి నిరుద్యోగులుగా వారిని మార్చే పద్ధతి , అంటే 'లోపలి' భాగం నుండి 'వెలపలి' భాగం లోకి గెంటివేసే పద్ధతి ఉంది. సోషలిజంలో 'వెలపలి' భాగం అనేదే లేదు. సోషలిజంలో కార్మికులు బలవంతం మీద పని చేయడం కాకుండా, తమ సమూహం కోసం స్వచ్ఛందంగా పని చేస్తారు. ఆ సమూహమే ఉత్పత్తి సాధనాలమీద పెత్తనం కలిగి వుంటుంది.
ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేయడం జరిగినప్పుడే అటువంటి సమూహం ఏర్పడుతుంది. సోషలిజం మనుగడకు ఇది ఒక అవశ్యమైన నియమం.
దీనినుండి మరొక తేడా వద్దకు వస్తాం. పెట్టుబడిదారీ విధానం పని చేయనివారిని, బద్ధకస్తులను శిక్షిస్తుంది. కాని సోషలిజం అటువంటి శిక్షించే వ్యవస్థగా ఉండజాలదు. ఈ 'శిక్షించడం' అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలోనే స్వత:సిద్ధంగా ఉంటుంది. ఏ పెట్టుబడిదారులైతే తగినంత అదనపు విలువను పోగేసుకోలేక పోతారో వారందరూ 'శిక్షించబడతారు'. వారి స్థానాల్లోకి వారికన్నా ఎక్కువగా సంపదను పోగేయగలిగినవారు వస్తారు. సహజంగానే వారు అంతకు ముందున్న వారికన్నా పెద్ద పెట్టుబడిదారులై వుంటారు. ఈ క్రమాన్నే మార్క్స్ 'పెట్టుబడి కేంద్రీకరణ' అన్న పేరుతో వివరించారు. అదే విధంగా పెట్టుబడిదారులకు సంతృప్తికరమైన రీతిలో పని చేయలేకపోయిన కార్మికులందరూ వారి స్థానాలను కోల్పోయి నిరుద్యోగ సైన్యంలో చేరుతారు. ఈ నిరుద్యోగ సైన్యం అనే 'వెలుపలి' భాగం శిక్షించబడ్డ కార్మికులకు గమ్యస్థానంగా మాత్రమే కాక, శ్రమపై పెట్టుబడి ఆధిక్యతను చెలాయించే సాధనంగా కూడా ఉంటుంది.
దీని నుండి రెండు నిర్ధారణలు వస్తాయి. మొదటిది-'సంక్షేమం పాటించే పెట్టుబడిదారీ విధానం' వైపుగా, ప్రజానీకపు స్థితిగతులను మెరుగుపరిచే దిశగా వేసే అడుగులు అదే సమయంలో ఈ వ్యవస్థకుండే 'శిక్షించే సామర్ధ్యాన్ని' తగ్గించివేస్తాయి. 'శ్రమ' పై 'పెట్టుబడి' ఆధిక్యతను బలహీనపరుస్తాయి. దీనిని కీన్స్ పూర్తిగా గ్రహించలేకపోయాడు. తన 'సంక్షేమ రాజ్యం' భావనను వ్యతిరేకిస్తున్నవారంతా కాలక్రమంలో తన మార్గానికే వస్తారని ఆశించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్న 'వెలుపలి' భాగాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రం కీన్స్ వాదాన్ని స్వీకరించలేదు. తాత్కాలికంగా నెలకొన్న పరిస్థితుల్లో, పెట్టుబడిదారీ వ్యవస్థ నిలదొక్కుకోడానికి సంక్షేమ చర్యలు చేపట్టినా, వాటిని ఆ తర్వాత కొనసాగించలేదు. అందుచేత 'సంక్షేమ విధానాలతో పెట్టుబడిదారీ విధానం', లేదా, 'సంస్కరించబడిన పెట్టుబడిదారీ విధానం' అనేది కేవలం ఒక భ్రమ. ఈ వ్యవస్థే మౌలికంగా శిక్షించే వ్యవస్థ అన్న విషయాన్ని అది మరిచిపోయింది.
రెండవది- సోషలిజం అనేది దాని స్వభావరీత్యానే శిక్షించే వ్యవస్థ కాదు. అందులో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించబడాలి. సోషలిజానికి పరివర్తన చెందే దశలో కొంత నిరుద్యోగం గాని, కొన్ని క్రమశిక్షణా చర్యలు గాని ఉండవచ్చునేమో గాని, సోషలిజం అనేది పూర్తిగా ఏర్పడ్డాక శిక్షించడం అనేది ఉండదు. సోషలిజం అంటేనే కార్మిక రాజ్యం. కార్మికులను వాళ్ళే శిక్షించుకుంటారనుకోవడం తప్పు.
ఆధునిక కాలంలో పూర్తి స్థాయిలో ఉపాధి కల్పన సాధించినవి పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ లోని సోషలిస్టు దేశాలు మాత్రమే. అక్కడ సోషలిజం కూలిపోయిన తర్వాత అన్ని చోట్లా ఉన్నట్టే అక్కడ కూడా నిరుద్యోగం పెరిగింది. సోషలిజం నిర్మాణంలో, దాని నడకలో ఆ దేశాలు కొన్ని పొరపాట్లను చేసివుండొచ్చు గాక. కాని ఆ పొరపాట్లను సోషలిస్టు వ్యవస్థకు ఉండే సహజమైన, శాశ్వతమైన లక్షణాలుగా చిత్రించడం చాలా తీవ్రమైన తప్పిదం.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్ పట్నాయక్






కామెంట్‌లు (0)