మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోరాట విజయం...

1 గంట క్రితం

Cockroaches
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

2026 జులై 25... విద్యార్థి, యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు. స్వాతంత్ర్యానంతర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజు. 72 రోజుల ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమైన రోజు. తనకు ఎదురే లేదని విర్రవీగుతున్న ‘విశ్వగురువు’ మెడలను వంచిన రోజు... ఇంకా ఆ రోజు విశిష్టతా వివరణలను అక్షరబద్ధం కావించడానికి కాగితాలు సరిపోవు. మెడికల్‌ ‌కాలేజీలలో అండర్‌ ‌గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ ‌టెస్ట్‌ (‌నీట్‌) ప్రశ్నా పత్రాల లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీమానామా డిమాండ్‌‌తో మొదలైన విద్యార్థి, యువజన ఉద్యమం ఇంతింతై.. అన్నట్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు విస్తరించి రోజు రోజుకూ మహోధృతమై చివరకు మోడీ ప్రభుత్వాన్ని కదిలించింది. విద్యార్థి, యువత పోరాట పటిమ రుచి చూపించింది. భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది. ఉద్యమానికి తలొగ్గి గత్యంతరం లేక మంత్రి ప్రధాన్‌ను మోడీ సర్కార్‌ తప్పించాల్సి వచ్చింది. నీట్‌ ప్రశ్నా పత్రాలు లీకైనప్పుడు తొలుత లైట్‌ ‌తీస్కుంది. విద్యార్థుల, ప్రతిపక్షాల ఆందోళనలతో పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్‌‌కు నిర్ణయం తీసుకుంది. కేసును సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకొంది. పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా ఎన్నో కష్టాలు పడ్డ లక్షలాది విద్యార్థుల మనో వ్యధను, మానసిక క్షోభతో 22 మంది ఆత్మార్పణలను ఎంత మాత్రం పట్టించుకోలేదు.

రీఎగ్జామ్‌‌తో వైఫల్యాల నుంచి తప్పించుకోవచ్చనుకున్న మోడీ ప్రభుత్వానికి ‘బొద్దింక’లు చేపట్టిన సోషల్‌ ‌మీడియా ఉద్యమం నలుదిక్కులా దావానలంలా వ్యాపించి, రాష్ట్రాలు, దేశం, ఖండాంతరాలకు చేర్చి గంగవెర్రులెత్తించింది. మొదట బొద్దింకలే కదా అనుకోగా పార్లమెంట్‌ ‌దాకా వచ్చింది. పార్లమెంట్‌ ‌సమావేశాల తొలి రోజు సోమవారం నిరసన తెలిపేందుకు వేలాదిగా తరలి వచ్చిన ఆందోళనకారులపై టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ ‌క్యానన్లు, కరెంట్‌ ‌షాకులు, లాఠీ ఛార్జీలు, చివరికి పెల్లెట్‌ గన్స్‌‌తో ఢిల్లీ పోలీసులు, మఫ్టీలో దుండగులు నిరసన కారులపై విరుచుకుపడినా రక్తం చిందించారే తప్ప అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. విద్యార్థినులని చూడకుండగా అసభ్య, అమానవీయ వేధింపులకు ఒడిగట్టినా ఉద్యమ జెండాను దించలేదు. యువత చేపట్టిన ఆందోళన వారి కోసం కాదు భవిష్యత్తు తరాల కోసం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం. ప్రభుత్వంలో జవాబుదారీతనం కోసం. మోడీ ప్రభుత్వానికి యువత డిమాండ్లపై తుది వరకు తిరస్కారమే.

ఒక కేసు సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత మిశ్రా నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చి అవహేళన చేయగా, అభిజీత్ ‌దీప్కె అనే యువకుడు వ్యంగ్యాస్ర్తాల పోస్టులు సంధించడం, అనంతరం కాక్రోచ్‌ ‌జనతాపార్టీ (సిజెపి) ఆవిర్భావం, స్వల్ప వ్యవధిలో లక్షలాది మంది ఫాలోవర్స్‌ ‌తయారవడం, నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై ఉద్యమం చిన్నగా ప్రారంభమై, ప్రముఖ పర్యావరణ ఉద్యమ నేత వాంగ్‌ చుక్‌ ‌నిరవధిక నిరశన దీక్షతో ఉధృతమై, దీప్కే దీక్షతో పతాక స్థాయికి చేరింది. ఆది నుంచీ ఈ ఉద్యమానికి సిపిఎం, వామపక్షాలు అండగా నిలిచాయి. పలు ప్రజాసంఘాలు, పార్టీలు సంఘీభావం తెలిపాయి. పోరాటం ప్రభుత్వ విధానాల పరంపరతో విద్యార్థి, యువతలో గూడుకట్టుకున్న అసహనం, అసంతృప్తికి ప్రతిరూపం. నిర్బంధం, అణచివేత, ఉక్కుపాదంతో నలిపేయడానికి వీలుకాదని గ్రహించినందునే ప్రధాని మోడీ ధర్మేంద్ర రాజీనామాకు దిగిరాక తప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అండ కలిగిన ధర్మేంద్ర ప్రధాన్‌‌ను ఆయన మాతృ సంస్థ ఆఖరి క్షణాల వరకు కాపాడాలనే చూసింది. ఉద్యమం విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లనీకూడదనే తాను రాజీనామా చేస్తున్నానన్న ధర్మేంద్ర ఉవాచ హేయమైనది. మంత్రులతో ఉద్యమకారుల చర్చల్లో మంత్రి రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకున్న నీట్‌ అభ్యర్ధుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు ఉంది. పరీక్షల విధానంలో సవరణల బిల్లు కంటి తుడుపే. అక్రమాలకు నిలయంగా ఉన్న నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ) రద్దు, పరీక్షా విధానం ప్రక్షాళన, వికేంద్రీకరణ, కార్పొరేటీకరణ-కాషాయీకరణ ప్రధానంగా ఉన్న జాతీయ విద్యా విధానం-2020 రద్దు డిమాండ్లు అలాగే ఉన్నాయి. ఈ పూర్వరంగంలోనే సిజెపి వ్యవస్థాపకులు దీప్కె ఇది ఆరంభం మాత్రమేనన్న ప్రకటనను చూడాలి. తతిమ్మా డిమాండ్ల సాధనకు విద్యార్థి, యువత మలి దశ పోరాటానికి నడుం కట్టాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్