- నామినేషన్ల దాఖలుకు పటిష్ట భద్రత
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్, బదిలీ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నామినేషన్ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దిశలో జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పిలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురు వ్యక్తులకే ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించేలా, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కలెక్టర్లతో ఫోన్లో సమీక్ష
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. రాయచోటి, పులివెందుల, తిరుపతి, దర్శి, రాజంపేట, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తతలపై వచ్చిన ఫిర్యాదులతో శనివారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు.
పటిష్ట బందోబస్తు : ఐజి రాజకుమారి
మీడియా సమావేశంలో ఐజి బి రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో పోలీసు బందోబస్తు పటిష్టం చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఘటనాస్థలికి ఎస్పి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వీడియో చిత్రీకరణతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి
ఎ మల్లికార్జున పాల్గొన్నారు.








కామెంట్లు (0)