ఎంపీటీసీ నామినేషన్లు 21 నుంచి 23 వరకు స్వీకరణ
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని బైరెడ్డిపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు. ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుని, సంబంధిత ఓటరు జాబితాలో పేరు కలిగి ఉండాలని సూచించారు. పన్ను బకాయిలుంటే ముందుగానే చెల్లించి రసీదులు భద్రపరచుకోవాలన్నారు. నామినేషన్తో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, ఆస్తులు–అప్పులు, విద్యార్హతలు, నేర చరిత్రకు సంబంధించిన వివరాలు సమర్పించాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు డిపాజిట్ రూ.3,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500గా నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ల సమయంలో ఊరేగింపులకు అనుమతి లేదని, అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో సహాయకుడు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి వెళ్లాలని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఒక వాహనానికే అనుమతి ఉంటుందన్నారు.బైరెడ్డిపల్లి మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. జడ్పీటీసీ అభ్యర్థులు చిత్తూరులో సంబంధిత రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించాలని పేర్కొన్నారు.







కామెంట్లు (0)