పాకిస్తాన్ : పాకిస్తాన్ మరోసారి భారత విమానాలకు గగనతల నిషేధాన్ని పొడిగించింది. మరో నెల రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. భారత్లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారత విమానయాన సంస్థలకు, ఆ సంస్థలు లీజు తీసుకున్న విమానాలపై ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఇది భారత సైనిక విమానాలకు కూడా వర్తిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం ... ఈ ఆంక్షలు 2026 నవంబర్ 24 ఉదయం 5.59 గంటల వరకు అమలులో ఉంటాయి.
ఆపరేషన్ సిందూర్ నుంచి ఎయిర్ స్పేస్ బ్యాన్ ....
2025 ఏప్రిల్ 23 న పాకిస్తాన్ భారత విమానాలపై ఆంక్షలు విధిస్తూ, గగనతల నిషేధాన్ని విధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పొడగిస్తూ వస్తోంది. పాకిస్తాన్ తన గగనతలాన్ని కరాచీ, లాహోర్ అనే రెండు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్లుగా విభజించింది. తాజా నిషేధం ఈ రెండు ప్రాంతాలకు వర్తిస్తుంది.
2025లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని పలు ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం భారత్పై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, భారత్ క్షిపణులు, వైమానిక దాడులతో పాక్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. రాడార్ కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, రన్ వేలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పాకిస్తాన్ పొడిగించుకుంటూ వస్తోంది. పాకిస్తాన్ చర్యలకు ప్రతిస్పందనగా 2025 ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ విమానయాన సంస్థలకు కూడా భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో రెండు దేశాలు పరస్పరం తమ గగనతలాన్ని నిషేధించుకున్నాయి.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఎఫెక్ట్ ....
పాకిస్తాన్ ఎయిర్స్పేస్ మూసివేయడంతో భారత పౌర విమానయాన రంగంపై ప్రభావం పడుతోంది. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రంపై నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఢిల్లీ లాంటి ఉత్తర భారతదేశంలోని ఎయిర్ పోర్టుల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం, ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయి.







కామెంట్లు (0)