బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమ్మెకు తలొగ్గిన అదాని

1 గంట క్రితం

image-cmwcdceqif2rq0js0rdnlzl8d.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 12:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోరాడి బోనస్‌ సాధించుకున్న కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు కార్మికులు

  • వారానికి 48 గంటల పనివేళలకూ అంగీకారం

  • సిఐటియు అండతో శ్రమజీవుల విజయబావుటా

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ‌దిగ్గజం అదాని గ్రూపు శ్రమజీవుల పోరాటానికి దిగొచ్చింది. బోనస్‌, పనివేళల మార్పునకు అంగీకరించింది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం అదానీ పోర్టులో సిఐటియు అండదండలతో కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతంమైంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాంట్రాక్టు కార్మికులంతా సమ్మె చేపట్టారు. దీంతో దొగిచ్చిన పోర్టు యాజమాన్యం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్మికులతో చర్చలు జరిపింది. కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్మికులందరూ తిరిగి విధుల్లో చేరారు. కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు 2007లో సివిఆర్ ప్రైవేటు యాజమాన్యం కింద ప్రారంభమయ్యాయి.

2021 నుంచి పోర్టును అదానీ పోర్ట్స్ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. సిఐటియు 2020లో ఈ పోర్టులో ఆందోళన చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి సమక్షంలో కాంట్రాక్టు కార్మికులందరికీ బోనస్ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి బోనస్ చెల్లిస్తున్నప్పటికీ, కొంతకాలంగా కొన్ని విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు సమ్మె నేపథ్యంలో ఈ నెల 11న కుదిరిన ఒప్పందం కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు కార్మికులకు గొప్ప విజయమని సిఐటియు పేర్కొంది. కార్మికులందరికీ బోనస్ సాధించడంతో పాటు, పనివేళలను వారానికి 60 నుంచి 48 గంటలకు తగ్గించగలిగామని తెలిపింది.

యాజమాన్యం మాటమార్చడంతో మెరుపు సమ్మె

పోర్టులోని అన్ని విభాగాల కార్మికులు సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో స్పందించిన 'మారుతి నందన్ లాజిస్టిక్స్' యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి, బోనస్‌ జమ చేస్తామని ప్రకటించడంతో వారు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. అయితే, అంతలోనే మాట మార్చిన యాజమాన్యం మంగళవారం మధ్యాహ్నం కొంతమందికి మాత్రమే బోనస్‌ జమ చేసింది. దీంతో మిగిలిన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కార్మికులు మళ్లీ మెరుపు సమ్మెకు దిగారు. ఓడల లోడింగ్, అన్‌లోడింగ్ జరిగే ప్రాంతానికి చేరుకుని ఆందోళన నిర్వహించడంతో పాటు, బోనస్‌తో పాటు మరికొన్ని డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కార్మికులు విధులను పూర్తిగా బహిష్కరించడంతో పోర్టులో కన్వేయర్ బెల్టులతో పాటు ఓడల రాకపోకలు, సరుకు రవాణా నిలిచిపోయాయి. కార్మికుల మెరుపు సమ్మెతో దిగొచ్చిన అదానీ యాజమాన్యం కార్మిక ప్రతినిధులతో చర్చలు జరిపి పలు డిమాండ్లకు అంగీకారం తెలిపింది. పెండింగులో ఉన్న కార్మికుల బోనస్‌లను వెంటనే చెల్లిస్తామని ప్రకటించింది. అదనపు పని గంటలను తగ్గిస్తూ వారంలో రెండు డే డ్యూటీలు, రెండు నైట్ డ్యూటీలు, రెండు ఆఫ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

అదానీ పోర్టు యాజమాన్యం

అంగీకరించిన డిమాండ్లు ఇవే..

  • వేతనంతో సంబంధం లేకుండా కాంట్రాక్టు కార్మికులందరికీ బోనస్ చెల్లించేందుకు సమ్మతి.

  • నెలకు రూ.35,000 మించి వేతనాలు తీసుకుంటున్న మెరైన్ కార్మికులకు కూడా బోనస్‌ ‌వర్తింపు.

  • ఇదివరకు కొన్ని విభాగాల్లో కొందరు కార్మికులకే బోనస్ చెల్లించేవారు. ఇకపై కార్మికులందరికీ బోనస్ అందుతుంది.

  • ఈ నెల నుంచే వారానికి 48 గంటల పనివేళలను అమలు చేయడానికి యాజమాన్యం ఒప్పుకుంది. ఇదివరకు కాంట్రాక్టు కార్మికులందరూ రోజుకు 12 గంటల చొప్పున, వారానికి 60 గంటలు పనిచేసేవారు. ఇప్పుడు ఇది 60 గంటల నుంచి 48 గంటలకు తగ్గింది.

  • డ్రైవర్లు, లోడర్ ఆపరేటర్లు, మెకానికల్ ఆపరేటర్లందరికీ బత్తా (అలవెన్సులు) చెల్లించడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది.

  • సివిఆర్ హాస్టల్‌ను ఖాళీ చేసిన కాంట్రాక్టు కా ర్మికులందరికీ వసతి కల్పించడానికి ఒప్పుకుంది.

  • మిగిలిన సమస్యలపై కార్మికుల ప్రతినిధి బృందంతో వీలైనంత త్వరగా చర్చించి పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్