బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారబోసేది వారబొయ్యి!

-174 నిమిషాల క్రితం

పారబోసేది వారబొయ్యి! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 04:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సాయంత్రం వేళ. లచ్చవ్వ ఇంటి పెరట్లో కూర్చుని కూరగాయలు తరుగుతోంది. కోడలు వంటగదిలో రాత్రి భోజనానికి వంట చేస్తోంది. బడి నుంచి వచ్చిన రుద్రాంశ్‌ పుస్తకాల సంచి పక్కన పెట్టి పెరట్లోకి వచ్చాడు. ఇంతలో కోడలు ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్లు, మరో పాత్రలో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి బయట పారబోయడానికి సిద్ధమైంది. అది చూసిన లచ్చవ్వ కోడలను వారిస్తూ.. ‘పారబోసేది వారబొయ్యి’ అన్నారు పెద్దలు. అది నీకు తెలియదా’ అంది. ‘అంటే ఏంటి లచ్చవ్వా?’ అని అడిగింది కోడలు. ‘అదొక సామెత. ‘వారబొయ్యి’ అంటే పక్కన ఉంచు అని అర్థం. ఏదైనా వస్తువును పారేయబోయేటప్పుడు, అది ఎవరికైనా కాస్తయినా ఉపయోగపడుతుందేమోనని ఆలోచించి పక్కన ఉంచాలి. అలా వృథా కాకుండా ఉపయోగించుకోవాలని పెద్దలు ఈ మాటను చెబుతుంటారు. బియ్యం కడిగిన నీళ్లను పారబోయకుండా మొక్కలకు పోయవచ్చు. కూరగాయల తొక్కలను గుంతలో వేస్తే ఎరువుగా మారి మొక్కలకు ఉపయోగపడతాయి. మిగిలిపోయిన అన్నం చెడిపోకుండా ఉంటే పశువులకు పెట్టవచ్చు. ఇలా వీలైనంతవరకు ఏదీ వృథా కాకుండా చూసుకోవాలి’ అంది లచ్చవ్వ.

అంతా వింటున్న రుద్రాంశ్‌ వెంటనే ‘అమ్మమ్మా! మరి పాత ప్లాస్టిక్‌ డబ్బాలను కూడా పారేయకుండా ఉపయోగించుకోవచ్చా?’ అని అడిగాడు. ‘ఎందుకు ఉపయోగించుకోలేమురా! వాటికి అడుగున చిన్న రంధ్రాలు చేసి, మట్టిని నింపి మొక్కలు నాటుకోవచ్చు. ఇంటి పెరట్లోనో, కిటికీ దగ్గరో పెట్టుకోవచ్చు’ అంది లచ్చవ్వ. రుద్రాంశ్‌ వెంటనే బియ్యం కడిగిన నీళ్ల గిన్నె తీసుకుని పెరట్లోని మొక్కలకు పోశాడు. అన్నాన్ని పశువులకు పెట్టాడు. కూరగాయల తొక్కలను ఎరువుల గుంతలో వేశాడు.

​- కాశీవిశ్వనాథం పట్రాయుడు,

శృంగవరపుకోట, 94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్