వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు సిఎం ఆదేశం
ఎపిఇఆర్‌సి తరహాలో విధులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పరిషత్ ఎన్నికలకు ముందు గ్రామాల్లో నీటిమీటర్లు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 160 వ నెంబర్ జిఓను జారీ చేసి, విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వును వెబ్‌సైట్ లో కనపడకుండా చేసిన ఉదంతం గుర్తుంది కదా! తాజాగా పట్టణాల్లోనూ. పరిషత్‌లలోనూ ఎన్నికలు ముగియడంతో సాగు నీటి రంగంపై తీవ్ర ప్రభావం చూపే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ వైపు సర్కారు అడుగులు పడుతున్నాయి. సాగునీటి వినియోగాన్ని నియంత్రించడం కోసం దీనిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన విద్యుత్ రంగంలో ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థ (ఎపి ఇఆర్‌సి)ను ప్రస్తావిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎపి ఇఆర్‌సి తరహాలోనే జలవనరుల రంగంలోనూ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. నీటి వినియోగంపై ఈ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. నిజానికి, జలవనరుల రంగంలో ఈ తరహా రెగ్యులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని సమైక్య రాష్ట్రంలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశించింది. రైతాంగం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. వివిధ పథకాల పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి ఆ తరహా ఆదేశాలు వస్తున్నాయి. తాజా సమావేశంలోనూ గంగా-కావేరి అనుసంధానం పథకాన్ని ప్రస్తావించిన సిఎం వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ ఆచరణలోకి వస్తే సాగునీటి మీటర్లు, యూజర్ ఛార్జీలు వంటివి తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎత్తిపోతల పునరుద్ధరణకు రూ.632 కోట్లు
వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పథకాల పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీర్ లేదంటే సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను నియమించి పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
జలవనరులశాఖ భూమిపై విద్యుత్ ఉత్పత్తి
జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల భూమిలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించామని, వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు సిఎంకు వివరించారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో 84 ప్రాంతాలను గుర్తించగా, వాటిలో 110 ఎకరాలను సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించుకోవచ్చని వీటిల్లో 25.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా 4,171 ఎకరాల భూమిని సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించడం ద్వారా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కేవలం భూములకే పరిమితం కాకుండా కాలువలపైనా సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సిఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా తీసుకున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్దేశించుకున్న గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు.







కామెంట్‌లు (0)