సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ల జాబితా నుంచి తొలగించినవారికే ప్రాధాన్యం

1 గంట క్రితం

ఓటర్ల జాబితా నుంచి తొలగించినవారికే ప్రాధాన్యం
- చేర్పుల అప్పీళ్లను వాయిదా వేయండి
- బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌‌పై  సుప్రీంకోర్టు ఆదేశాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:55 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- చేర్పుల అప్పీళ్లను వాయిదా వేయండి

- బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు దాఖలు చేసిన అప్పీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్రంలోని అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఆదేశించింది. ఓటర్ల చేర్పులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్ల విచారణను ప్రస్తుతానికి వాయిదా వేయాలని సూచించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన నేతృత్వంలోని ధర్మాసనం, అప్పీళ్లను రెండుగా విభజించాలని ట్రిబ్యునళ్లను ఆదేశించింది. ఒకటి, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినవారి అప్పీళ్లు. రెండవది, చేర్పులను సవాలు చేస్తూ ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) దాఖలు చేసిన అప్పీళ్లు. ‘‘రెండో రకం అప్పీళ్లలో అత్యవసరం ఏమీ లేదు. వాటిని ప్రస్తుతానికి వాయిదా వేయవచ్చు. మొదటి రకం అప్పీళ్ల తుది పరిష్కారంలో ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆ పరిధిలో తొలగించబడిన ఓటర్ల అప్పీళ్లకు అదనపు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను త్వరగా పరిష్కరించేందుకు కలకత్తా హైకోర్టుతో సంప్రదించి అప్పీలేట్ ట్రిబ్యునళ్ల సంఖ్యా బలాన్ని పెంచాలని, కోల్‌కతా వ్యాప్తంగా ట్రిబ్యునళ్లకు ప్రత్యామ్నాయ భవనాలను గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఇసిఐ) సుప్రీంకోర్టు ఆదేశించింది.

​

భారీగా పేరుకుపోయిన అప్పీళ్లు

పశ్చిమ బెంగాల్‌లో సుప్రీంకోర్టు 2026 మార్చి 10న ఇచ్చిన ఆదేశాల మేరకు 19 అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. అయితే న్యాయమూర్తులు రాజీనామా చేయడంతో రెండు ట్రిబ్యునళ్లు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 17 నాటి గణాంకాల ప్రకారం, మిగిలిన 17 ట్రిబ్యునళ్లు 1,26,194 కేసులను పరిష్కరించగా, ఇంకా 37,05,235 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. దాఖలైన 38 లక్షల అప్పీళ్లలో కేవలం లక్షకు పైగా మాత్రమే పరిష్కారమయ్యాయని, వాటిలో 93 శాతం తొలగించిన ఓటర్లకు అనుకూలంగా వచ్చాయని భూషణ్ తెలిపారు. కోల్‌కతా మున్సిపల్ ప్రాంతంలో రెండు లక్షలకు పైగా ఓటర్లను తొలగించారని, వారి అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన కోర్టుకు నివేదించారు.

చేర్పులను సవాలు చేస్తూ సిఇఒ అప్పీళ్లు దాఖలు చేశారని ఇసిఐ సొంత అఫిడవిట్‌లోనే ఉందని, అయితే అలా దాఖలు చేసేందుకు ఆయనకు చట్టపరంగా అధికారం లేదని శంకరనారాయణన్ ధర్మాసనానికి తెలిపారు. ‘‘సంబంధిత ఎన్నికల నిబంధనల్లోని రూల్ 23 ప్రకారం, రూల్ 20, 21 లేదా 22ఏ కింద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి తీసుకున్న నిర్ణయంపై, ఎన్నికల సంఘం నియమించిన ప్రభుత్వ అధికారికి అప్పీల్ చేయవచ్చు. అంటే ఇది ఫలితంగా ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంఘానికే చేసే అప్పీల్. తన సొంత అప్పీలేట్ అథారిటీ ముందు ఎన్నికల సంఘం అప్పీళ్లు దాఖలు చేయడం అనే ప్రశ్నే తలెత్తదు.’’ అని శంకరనారాయణన్‌ ‌కోర్టుకు వివిరించారు. ఈ నేపథ్యంలో, చేర్పులపై దాఖలైన అప్పీళ్ల విచారణను వాయిదా వేయాలని ధర్మాసనం సూచించింది.

అక్టోబర్‌లో బెంగాల్‌ రాష్ట్ర సిఇఒ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, తొలగించిన ఓటర్లు ఫారం 6 ద్వారా తిరిగి జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇది గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, డూప్లికేట్ (ఎఎస్‌‌డిడి) వర్గాల్లోని ‘మిగిలిపోయిన’ ఓటర్ల కోసం ఇసిఐ చేపట్టిన ప్రత్యేక నమోదు కార్యక్రమానికి అనుగుణంగా ఉండటం గమనార్హం. అయితే సోమవారం ప్రారంభం కావాల్సిన ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) 2027ను వాయిదా వేస్తున్నట్లు బెంగాల్ సిఇఒ కార్యాలయం ప్రకటించింది. ‘‘అనివార్య పరిస్థితుల’’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ను ఇంకా తెలియజేయలేదు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 90 లక్షల ఓట్లను ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్