సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌కు రూ.15 వేల కోట్ల భారత్ ప్యాకేజీ

1 గంట క్రితం

నేపాల్‌కు రూ.15 వేల కోట్ల భారత్ ప్యాకేజీ
- ప్రధాని మోడీ, నేపాల్‌ పిఎం బాలేంద్ర షా భేటీ 
- అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు రైలు
- ఐఐటి క్యాంపస్, స్టార్టప్ ఇంక్యుబేటర్లకు భారత్ హామీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రధాని మోడీ, నేపాల్‌ పిఎం బాలేంద్ర షా భేటీ

- అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు రైలు

- ఐఐటి క్యాంపస్, స్టార్టప్ ఇంక్యుబేటర్లకు భారత్ హామీ

న్యూఢిల్లీ : నేపాల్‌ అభివృద్ధి కార్యకలాపాల కోసం రూ.15వేల కోట్ల ప్యాకేజీని భారత్‌ ‌సోమవారం ప్రకటించింది. దీంతోపాటు ఇంధన ప్రాజెక్టులను, రెండు దేశాల మధ్య అనుసంథానత పెంచే పలు చర్యలను భారత్‌ తీసుకుంది. ‌ప్రస్తుతం భారత్‌ ‌పర్యటనలో వున్న నేపాల్‌ ‌ప్రధాని బాలేంద్ర షా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంథానత రంగాలపై ప్రధానంగా చర్చించారు. అయోధ్య, నేపాల్‌‌లోని జనక్‌‌పూర్‌‌ల మధ్య కొత్త రైలు సర్వీస్‌‌ సరయు - కమలా ఎక్స్‌‌ప్రెస్‌‌ను ఉభయ పక్షాలు ప్రారంభించాయి. అధునాతన జల విద్యుత్ ప్రాజెక్టును, చమురు పైప్‌‌లైన్‌‌ను కూడా ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌‌ల్లోని నగరాలతో నేపాల్‌కు విస్తృతంగా అనుసంధానతను పెంచేలా రోడ్డు, రైలు సర్వీసులను బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు.

విద్య, వినూత్న ఆవిష్కరణ, వ్యవసాయం, యువజనాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.

విశ్వాసమే పునాదిగా బంధం

​ ద్వైపాక్షిక సమావేశానంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారత్‌, నేపాల్‌ ‌మధ్య సంబంధం ఇరుగు, పొరుగు దేశాల మధ్య సంబంధం వంటిది కాదని, అది ఒక బంధుత్వంతో కూడిన సంబంధమని, విడదీయలేని నమ్మకంతో కూడిన సంబంధమని వ్యాఖ్యానించారు. ‘‘మన సంతోషాలు, ఆనందాలు పంచుకుంటాం, అలాగే మన సవాళ్లను కూడా. ఒకరి ప్రగతిలో మరొకరు భాగస్వాములం, క్లిష్ట సమయాల్లో పరస్పర సహకారం, మద్దతునందించుకుంటాం.’’ అని అన్నారు. ఉమ్మడి చరిత్ర, విశ్వాసం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు ద్వారా భారత్‌, నేపాల్‌ ఒకటితో ఒకటి పెనవేసుకుపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు మాసంలో నేపాల్‌‌లో సంభవించిన వినాశకర వరదల్లో మరణించిన వారికి ప్రధాని మోడీ తీవ్ర సంతాపం తెలియచేశారు.

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాల్లో తీవ్ర అంతరాయాలు, సవాళ్ళు ఎదురైనా నేపాల్‌‌కు నిత్యావసరాలు, ఎరువులు,ఇంధన సరఫరాలు అందేలా భారత్‌ ‌చూసిందని చెప్పారు. పొరుగుదేశాలకు ప్రాధాన్యతనివ్వాలనే భారత్‌ ‌నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. యువజనాభివృద్ధికి, నేపాల్‌‌లో వినూత్న ఆవిష్కరణలకు భారత్‌ ‌మద్దతునిస్తుందన్నారు. స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌‌ను ఏర్పాటు చేస్తామని, ఐఐటి విదేశీ క్యాంపస్‌‌ను నెలకొల్పుతామని చెప్పారు. నేపాలీ విద్యార్ధులకు భారత్‌‌లో లా, టెక్నాలజీ రంగాల్లో స్కాలర్‌‌షిప్‌‌ల అవకాశాలను విస్తరిస్తామన్నారు. నేపాల్‌‌లో వ్యవసాయ, పారిశ్రామిక పార్క్‌‌ను అభివృద్ధిపరచడంలో భారత్‌ ‌సాయపడుతుందన్నారు.

​

హిమాలయాలంత ధృఢంగా సంబంధాలు

​ పరస్పర గౌరవం, నమ్మకం, సహృదయతల ప్రాతిపదికన ఇరు దేశాల మధ్య సంబంధాలు నెలకొన్నాయని నేపాల్‌ ‌ప్రధాని షా పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలే ఇందుకు పునాది అన్నారు. హిమాలయాలంత ధృఢంగా, సముద్రమంతా విశాలంగా ఈ సంబంధాలుంటాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు, క్లిష్ట సమయల్లో తొలిగా స్పందించేది భారత్‌ అని పేర్కొన్నారు. రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సులో భాగస్వాములు కావాల్సిందిగా ఆయన భారత పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఉత్తరాఖండ్‌‌లోని చంపావతి జిల్లాలో బంబాస వద్ద కొత్త ఇంటిగ్రేటెడ్‌ ‌చెక్‌‌పోస్ట్‌ (‌ఐసిపి)కి ఇరువురు నేతలు పునాది వేశారు. ప్రతిపాదిత సిలిగురి - ఝపా పెట్రోలియం పైప్‌‌లైన్‌‌కు కూడా పునాది వేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్