– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన రెండవ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ (ఎన్నికైన, ఓటమి చెందినవారు) తమ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 99 పట్టణ స్థానిక సంస్థల్లో 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పూర్తయ్యాయని, మురసు తుపాను కారణంగా చీరాల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు, ఫలితాలను 6న ప్రకటించినట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన తుది వివరాలను సమర్పించాలని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 99 పట్టణ స్థానిక సంస్థల్లోని అభ్యర్థులు డిసెంబరు 18, చీరాల మున్సిపాలిటీలోని అభ్యర్థులు డిసెంబరు 21లోపు ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లు, సన్నద్ధత, శాంతిభద్రతల పరిస్థితులు, పోలీసు బందోబస్తు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.







కామెంట్లు (0)