అమరావతి : దీపావళి వేడుకల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షించిన 17 నగరాల్లోనూ వాయు కాలుష్యం పెరగ్గా, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాల్లో గాలి నాణ్యత 'పేలవమైన' స్థాయికి పడిపోయింది.
సోమవారం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) బులెటిన్ ప్రకారం, విశాఖపట్నంలో అత్యధికంగా 264 ఏక్యూఐ నమోదు కాగా (క్రితం రోజు 229), రాజమహేంద్రవరంలో కాలుష్యం అత్యంత వేగంగా పెరిగింది. అక్కడ క్రితం రోజు 104గా ఉన్న ఏక్యూఐ ఒక్కసారిగా 220కి చేరి 'మధ్యస్థ' స్థాయి నుంచి 'పేలవమైన' స్థాయికి పడిపోయింది.
మిగిలిన 15 నగరాల్లో ఏక్యూఐ నమోదు 101 నుండి 200 మధ్య ఉండి 'మధ్యస్థంగా’ కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ పి. కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 12 నగరాల్లో 'సంతృప్తికరమైన' స్థాయి ఉండగా, కేవలం విశాఖపట్నం మాత్రమే 'పేలవంగా' ఉండిందని ఆయన గుర్తుచేశారు.
వివిధ నగరాల్లో నమోదు :
* మధ్యస్థ వర్గంలో ఉన్న నగరాలు: తిరుపతిలో అత్యధికంగా 191 ఏక్యూఐ నమోదు కాగా, నెల్లూరు (175), శ్రీకాకుళం (170) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఏలూరులో అత్యల్పంగా 118 నమోదు అయింది.
* మారిన పరిస్థితులు: ఆదివారం వరకు సంతృప్తికరమైన గాలి నాణ్యత కలిగిన అమరావతి, విజయవాడ, గుంటూరు, అనంతపురం నగరాల్లో కూడా ఒక్కసారిగా వాయు నాణ్యత క్షీణించింది.
* ప్రధాన కాలుష్య కారకాలు :
విశాఖపట్నం, రాజమహేంద్రవరం సహా మెజారిటీ నగరాల్లో అత్యంత చిన్న ధూళి కణాలు (PM2.5) ప్రధాన కాలుష్య కారకంగా మారాయి. అమరావతి, ఏలూరు, కాకినాడ నగరాల్లో PM10 కణాలు ఎక్కువగా ఉండగా, విజయవాడలో PM2.5 మరియు PM10 రెండూ ప్రధాన కాలుష్య కారకాలుగా నమోదయ్యాయి.
గాలి నాణ్యత సూచీ (AQI) 101-200 మధ్య ఉంటే ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారికి శ్వాసకోశ అసౌకర్యం కలుగుతుందని; 201-300 స్థాయికి చేరితే ఎక్కువ సమయం బయట గడిపే సాధారణ ప్రజలకు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు.







కామెంట్‌లు (0)