• నిర్వహణ ఖర్చు వినియోగదారులపైనే
• నీటి వినియోగదారుల సంఘాలదే వసూలు బాధ్యత
• కేటాయింపు కంటే ఎక్కువ వాడితే జరిమానా
• ప్రపంచబ్యాంకు ఆదేశాల అమలే లక్ష్యం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో నీటిని వ్యాపార సరుకుగా మార్చేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణల్లో భాగంగా నీటిని ఉచితంగా ఇవ్వకూడదనే నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎంత నీటిని వినియోగించుకుంటే అంత ఖర్చును రైతులు(నీటి వినియోగదారుల సంఘాలు) భరించాల్సి ఉంటుంది. కేటాయించిన నీటికన్నా ఎక్కువ వాడుకుంటే జరిమానా విధించే అధికారం రెగ్యులేటరీ కమిషన్‌కు ఉండేలా నిబంధనలు రూపొందించనున్నారు. ఏ ప్రాంతానికి, ఏ పంటలకు ఎంత నీరు అవసరం అవుతుందనే విషయాన్ని నిర్థారించేందుకు రెగ్యులేటరీ అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించారు. ఈ విషయాన్ని అప్పట్లో ప్రజాశక్తి బయటపెట్టింది. ఇప్పుడు అదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా 'ఆంధ్రప్రదేశ్ వాటర్ సెక్టార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్' (ఎపిడబ్ల్యుఎస్‌ఐపి) నిబంధనలకు అనుగుణంగా 2009లో ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ రెగ్యులేటరీ కమిషన్ చట్టం రూపొందించారు. దీనికోసం 15/2009 కింద ఉమ్మడి ఎపి రాష్ట్రంలో చట్టం కూడా చేశారు. రైతుల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో దీన్ని అమలు చేయడం లేదు.
ఇవీ కీలక నిబంధనలు
వాటర్ రెగ్యులేటరీ కమిషన్‌కు సంబంధించి తొలుత మొత్తం రాష్ట్ర సాగునీటి అవసరాలను అంచనా వేయనున్నారు. ప్రతి ఏటా కాలువ నిర్వహణ, మరమ్మతులకు అయ్యే ఖర్చును లెక్కించి కాలువ ఆయకట్టు పరిధిలో రైతుల నుండి దాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. కమిషన్ ఏర్పాటు వల్ల నీటి వృథాను అరికట్టవచ్చని చెబుతున్నప్పటికీ వాస్తవంగా ‘ఫుల్ కాస్ట్ రికవరీ’ పద్ధతిని అనుసరించనున్నారు. దీనికి వీలుగా రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏటా విచారణ జరిపి ఖర్చులు, నిర్వహణ భారం తదితరాల ఆధారంగా యూజర్ ఛార్జీలు, నీటి తీరువా విధించనుంది. తొలిదశలో కాలువల్లో నీటిపై నిర్వహణ ఖర్చులు వేసినా భవిష్యత్‌లో పొలాల్లో వేసుకునే బోర్లు, బావుల వంటి భూగర్భ జలాల వినియోగంపై కూడా నియంత్రణలు, మీటర్లు, ఛార్జీలు విధించే అవకాశం ఉందని తెలిసింది. సీజన్ల వారీగా సాగునీరు, పట్టణ/గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలు ఇలా వివిధ తరగతులకు ఎంత నీరు అవసరమో కమిషన్ నిర్ణయిస్తుంది. ఆమో దించిన పంటల ఆధారంగా ప్రాజెక్ట్ కమిటీలు, డిస్ట్రి బ్యూటరీ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘా లకు సాగునీటి అవసరాలను ఖరారు చేస్తుంది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతులకు అయ్యే ఖర్చును కమిషన్ లెక్కించి ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తుంది. ప్రతి ఏటా దీన్ని సవరించేందుకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. నిర్థారించిన సొమ్మును వసూలు చేసే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలకే అప్పగించనున్నట్లు తెలిసింది. వసూలు చేయలేని పక్షంలో జరిమానాలు విధించే అధికారం కూడా కమిషన్‌కు కల్పించే విధంగా విధివిధానాలు రూపొందించనున్నారు.
నామమాత్రంగా జలవనరులశాఖ
కమిషన్ ఆమోదం పొందితే జలవనరులశాఖ అధీనంలో ఉన్న అధికారాలన్నీ కమిషన్‌కు వెళతాయని ఇరిగేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతానికి ఎంత నీటిని పంపించాలి, ఎంత నీటిని వినియోగించాలి దీనికి అయ్యే ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్(ఓఅండ్‌ఎం) ఖర్చులు ఏ పద్ధతిలో వసూలు చేయాలనేది కమిషన్ నిర్ణయించనుంది. దీనివల్ల జలవనరులశాఖ నామమాత్రంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.
పర్రిశమలకు ప్రాధాన్యత
వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాలకు నీటి పంపిణీలో నిబంధనలు అమలు చేయనున్నారు. సాగునీటితోపాటు పరిశ్రమలకు సరఫరా చేసే నీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనివల్ల నికరమైన ఖర్చులేని ఆదాయం వస్తుందనే కోణంలోనూ నిబంధనలు రూపొందించనున్నట్లు తెలిసింది.






కామెంట్‌లు (0)