గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెట్టుబడుల గమ్యంగా రాష్ట్రం

17 నిమిషాల క్రితం

CII UNION MINISTER PIYUSH GOYAL (7).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:28 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌, సిఎం చంద్రబాబు

  • విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

  • తొలి రోజు రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు

  • 88 ఒప్పందాలు

  • 1.07 లక్షల మందికి ఉద్యోగావకాశాలంటూ ప్రకటన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : ప్రపంచంలో అనిశ్చితి ఉన్నా భారత్‌‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పెట్టుబడులే లక్ష్యం... అభివృద్ధే అజెండా’ అని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ ‌గోయల్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) 31వ ఎడిషన్‌ ‌పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ ‌కాలేజీ గ్రౌండ్స్‌‌ జరుగుతున్న ఈ సదస్సులో విదేశీ, స్వదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. తొలి రోజు 88 ఎంఒయుల ద్వారా రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. 1.07 లక్షల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నట్టు వెల్లడించారు. సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌మాట్లాడుతూ... ప్రపంచ జిడిపిలో నాలుగింట మూడొంతుల వాటా కలిగిన దేశాల మార్కెట్లలో భారత్‌‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రపంచం అంతా అనిశ్ఛితి, సంక్షోభ పరిస్థితులు ఉన్నా భారత్‌‌లో పెట్టుబడులు, వాణిజ్యానికి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోకెల్లా స్వేచ్ఛాయుత మార్కెట్‌ ‌భారత్‌‌లోనే ఉందన్నారు. విశాఖను వరుస తుపాన్లు ముంచెత్తినా ఇక్కడి ప్రజలు సంకల్ప బలంతో ఎదుర్కొని నిలబడ్డారని కొనియాడారు. ఎఐ, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ ఇంజినీరింగ్‌, డేటా సెంటర్లతో ఎపి ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌నుంచి స్పీడ్‌ ఆఫ్ డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌దశకు చేరడం గొప్ప పరిణామమన్నారు. గత నాలుగున్నరేళ్లలో 38 దేశాలతో భారత్‌ తొమ్మిది ‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుందని, ఈ దేశాల మొత్తం ప్రపంచ జిడిపి వాటా 60 ట్రిలియన్‌ ‌డాలర్లుగా ఉందని అన్నారు. ప్రస్తుత సదస్సులో పెట్టుబడులు అనుకూలిస్తే ఈ విలువ 85 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, మొత్తం 115 ట్రిలియన్‌ ‌డాలర్ల ప్రపంచ జిడిపిలో దాదాపు నాలుగింట మూడు వంతులతో సమానమని అన్నారు. దేశంలో 2.5 లక్షల స్టార్టప్‌‌లకు అవకాశాలేర్పడ్డాయని తెలిపారు.

సిఎం చంద్రబాబు మాట్లాడుతూ, పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికను తయారు చేసిందని చెప్పారు. ఈ సదస్సు ద్వారా 25 రంగాల్లో 303 ఎంఒయులు వచ్చే అవకాశముందని, రూ.9.89 లక్షల కోట్ల ప్రతిపాదనలను ఆకర్షించడం లక్ష్యమని అన్నారు. పెట్టుబడుల ఎంఒయులే గాక వాటిని పరిశ్రమలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిశ్రమలు, ఇంధనం, ఎలక్ర్టానిక్స్‌, రక్షణ, అంతరిక్షం, ఎఐ డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, సాగునీటి రంగం ఇలా 25 రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి, 2047 నాటికి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌ 1 స్థానంలో నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 2024 జూన్‌ ‌నుంచి ఇప్పటి వరకూ రాష్ర్టంలో రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులు (714 ప్రాజెక్టులు) వచ్చాయని పేర్కొన్నారు. అప్పటి ఎంఒయులకు సంబంధించి రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ర్టానికి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.32.49 లక్షల కోట్లుగా చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ రాష్ట్రం కీలక గమ్య స్థానంగా ఉందని, రాష్ర్టంలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్‌ ‌ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. విశాఖ డేటా సెంటర్లకు గమ్య స్థానంగా నిలుస్తుందన్నారు. అమరావతిని అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో 250 ఎకరాల్లో క్వాంటమ్‌ ‌కంప్యూటింగ్‌ ‌వ్యాలీని అభివృద్ధి చేసి 2027 ఫిబ్రవరి 3న ప్రారంభించబోతున్నా మన్నారు. సముద్ర తీరాన్ని రాష్ర్ట ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా మలచుకునే దిశగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.... నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా, ప్రస్తుతం166కు చేరిందన్నారు. మరో రెండేళ్లలో స్వదేశీ ప్రాంతీయ పౌర విమానాన్ని తయారు చేసేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ‌మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని అని, పెట్టుబడిదారులు వారి కలలతోపాటు రాష్ట్ర కలను నిజం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు. భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమలు నిర్వహించాల న్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ హోమ్‌గా మార్చుకోవాల్సి ఉందన్నారు. పరిశ్రమలకు వేగవంతమైన సేవలు అందించడంతోపాటు ప్రోత్సాహకాలు సకాలంలో చెల్లించేందుకు ఎస్క్రో ఖాతాల విధానం అమలు చేస్తున్నామని, త్వరలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారు. వేదికపై రాష్ట్ర మంత్రులు టిజి భరత్‌, బిసి జనార్ధన్‌ రెడ్డి, సిఎస్‌ ‌సాయిప్రసాద్‌, జిఎంఆర్‌ ‌సంస్థ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు, కియా సిఇఒ గ్వాంగ్‌‌లీ, సాగర్‌ ‌డిఫెన్స్‌ సిఒ నికుంజ్‌ ‌పరాశర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్