గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేరుకుపోతున్న ‘ఫీజు’ బకాయిలు

-316 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 05:44 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 5వేల కోట్ల వరకు పెండింగ్‌

  • విద్యార్థులపై ప్రైవేట్‌ కళాశాలల ఒత్తిళ్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలులో నెలకొన్న జాప్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం నుంచి కళాశాలలకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆ భారం విద్యార్థులపై పడుతోంది. ఒకవైపు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం, మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రూ.5వేల కోట్ల వరకు కళాశాలల యాజమాన్యాలకు రీ యింబర్స్‌మెంట్‌ ‌మొత్తం చెల్లించాల్సి ఉంది. ‌వైసిపి ప్రభుత్వం అధికారం దిగే నాటికి మూడు క్వార్టర్లను పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇవి సుమారు రూ.1800కోట్ల వరకు ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బకాయిలు సుమారు రూ.5వేల కోట్ల వరకు చేరుకున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో రూ.1600కోట్లు, 2025-26 విద్యాసంవత్సరంలో మరో 1600కోట్లు కలిపి రూ.3200కోట్లకు చేరాయి. పాత ప్రభుత్వంలో రూ.1800కోట్లు, కొత్త ప్రభుత్వం రూ.3200కోట్లతో ప్రస్తుతం రూ.5వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిల్లో సుమారు రూ.1300కోట్లు డిగ్రీ కళాశాలలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ బకాయిలను విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. బకాయిల పేరుతో కొన్ని కళాశాలలు కోర్సు పూర్తిచేసినా విద్యార్ధులకు సర్టిఫికేట్లు కూడా అందించడం లేదు. ఫీజు బకాయిల సమస్యను ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాలు పరిష్కరించాల్సి ఉండగా, మధ్యలో విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

​ బకాయిలు విడుదల చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

రాష్ట్రప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌నిధులను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్‌, ప్రసన్నకుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఫీజుల బకాయిలు అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తూ ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులోని ఎస్‌‌విసెట్‌ ‌కళాశాల విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులపై ఒత్తిళ్లకు కారణమైన ఎస్‌విసెట్‌ కళాశాల యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల గుర్తింపును రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బకాయిలు విడుదలయ్యే వరకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్