గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionర్యాప్‌ వేదికపై సామాజిక స్వరం..

-262 నిమిషాల క్రితం

ర్యాప్‌ వేదికపై సామాజిక స్వరం image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 05:08 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సంగీత ప్రపంచంలో హిప్‌హాప్‌ సంస్కృతిలో భాగంగా వినిపించే ర్యాప్‌ పాటలకు యువతలో మంచి ఆదరణ ఉంది. ఫాస్ట్‌ బీట్స్‌, వేగవంతమైన సంగీతం, పదునైన పదాలతో సాగే ఈ పాటలు ఎక్కువగా వినోదానికే పరిమితమవుతుంటాయి. అయితే ముంబయి శివారు పట్టణమైన కళ్యాణ్‌కు చెందిన ర్యాపర్‌ మధుర ఘనే మాత్రం తన పాటల ద్వారా సమాజంలోని అనేక సమస్యలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. 'మహి జి'గా ప్రాచుర్యం పొందిన 29 ఏళ్ల మధుర ర్యాప్‌లో పర్యావరణ విధ్వంసం, ఆదివాసీల హక్కులు, రైతుల కష్టాలు, కుల వివక్ష, సామాజిక అణచివేత వంటి అంశాలు ప్రతిధ్వనిస్తాయి. అణగారిన వర్గాల జీవితాలను, వారి పోరాటాలను సంగీతం రూపంలో వినిపిస్తున్న అతికొద్దిమంది కళాకారుల్లో మధుర ఒకరు. ఈ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు 'సౌత్‌ ఏషియా స్పీక్స్‌ ప్రైజ్‌' లభించింది.

మధుర ర్యాప్‌లో కనిపించే ప్రత్యేకత ఏంటంటే.. ఆమె తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. ఆ తరువాత అవి పాటలుగా తయారవుతాయి. ఆమెకు ర్యాప్‌ అంటే వేగంగా పదాలు పలకడం, బీట్‌కు అనుగుణంగా పాడటం మాత్రమే కాదు. సామాజిక సమస్యలపై మధుర రాసిన మొట్టమొదటి పాట రైతుల పోరాటానికి సంబంధించినది. 2019లో రైతుల నిరసనల నేపథ్యంలో కేవలం 12 లైన్లతో ఈ పాటను రూపొందించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి ఆదివాసీ ప్రజల జీవితాలను మధుర దగ్గరగా చూశారు. కట్టెల కోసం అడవుల్లో తిరగడం, కొండలు, వాగులు దాటుకుంటూ జీవనం సాగించడం, ప్రమాదకరమైన దారుల్లో నడుస్తూ పిల్లలు పాఠశాలలకు వెళ్లడం.. ఇవన్నీ ఆమెను కదిలించాయి. వర్షం పడినప్పుడు పాఠశాలల్లో పిల్లలు తమ అన్నం పళ్లేలు పట్టుకుని పరుగులు తీయడం, వర్షపు నీరు పప్పులో కలిసిపోవడం వంటి దృశ్యాలు ఆమె మనసులో చెరగని ముద్ర వేశాయి. ‘ఆ ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను సమస్యలుగా భావించరు. అవి తమ రోజువారీ జీవితంలో భాగమని అనుకుంటారు. ఆదివాసీ, దళిత ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సామాజిక వివక్షను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను’ అని మధుర చెబుతారు.

ర్యాప్‌ వేదికపై సామాజిక స్వరం image 1

​జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం...

ఆదివాసీల జీవితాలపై ఆమె స్వయంగా రాసి పాడిన ‘జంగిల్‌ చా రాజా’ పాట అడవిని వనరుగా చూసే వర్గానికి, ప్రకృతిని జీవనాధారంగా భావించే ఆదివాసీ దృక్పథానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది. ‘మీరు జెండా ఎగురవేసి అభివృద్ధి అంటారు. నేను ప్రకృతిని ఆరాధించడం అంటాను. నీళ్లు, అడవి, భూమి లేకుండా ఏ రాజూ నిలబడలేడు’ అనే ఆమె మాటల్లోనే ఈ పాట ఉద్దేశం స్పష్టమవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగిస్తున్న దశాబ్దాల పోరాటాన్ని కూడా ఆమె తన ర్యాప్‌లో వినిపిస్తారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పాటలు పాడుతున్న ఒడిశా ర్యాపర్‌ సుమిత్‌ సామోస్‌, తమిళనాడుకు చెందిన అరివు, పర్యావరణ పరిరక్షణపై పాటలు రూపొందిస్తున్న ముంబయి ర్యాపర్‌ స్వదేశీ వంటి కళాకారుల సరసన మధుర కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అంబేద్కర్‌కు నివాళిగా పాడిన ‘బాప్‌ మనుస్‌’ పాట ఆమె సామాజిక దృక్పథానికి మరో ఉదాహరణ. కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం అంబేద్కర్‌ సాగించిన పోరాట స్ఫూర్తిని ఈ పాట గుర్తుచేస్తుంది. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఈ పాటను ఆలపించడం ఆమె కెరీర్‌లో మర్చిపోలేని అనుభవం. అక్కడికి వెళ్లినప్పుడు విద్యార్థులు ఆమెను ఆహ్వానిస్తూ ‘జంగిల్‌ చా రాజా’ పాటను ముక్తకంఠంతో పాడారు. ఆ సంఘటన ఆమెను ఎంతో ఉద్వేగపరిచింది. వాతావరణ మార్పుల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై ఒకేలా ఉండదని, ముఖ్యంగా పేదలు, కార్మికులు మరింతగా నష్టపోతున్నారని మధుర తన పాటల్లో చెబుతారు. 2024లో దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంపై రూపొందించిన 'హీట్‌ వేవ్‌' ర్యాప్‌లో ఈ సమస్యను ప్రస్తావించారు. ఎండలు మండిపోతున్నప్పుడు ఏసీ గదుల్లో పనిచేసేవారికి, మండుటెండలో పనిచేయక తప్పని గృహకార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఈ పాట తెలియజేస్తుంది.

​ఉద్యోగం చేస్తూనే...

సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మధురకు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉంది. తండ్రి యశ్వంత్‌ థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బస్‌ కండక్టర్‌. తల్లి శోభ గృహిణి. అమ్మ, అమ్మమ్మ పాడే వల్లరి భజనలు వింటూ పెరిగింది. పాఠశాల కార్యక్రమాల్లో మాట్లాడటం, తండ్రి రాసిన కవితలు చదవడం ద్వారా తనలోని భావాలను ధైర్యంగా వ్యక్తం చేయడం అలవర్చుకుంది. ఇంజినీర్‌గా చూడాలన్న తల్లి కోరిక మేరకు మలాడ్‌లోని అథర్వ కాలేజీలో చేరిన మధురకు అక్కడే ర్యాప్‌తో పరిచయం ఏర్పడింది. కోల్‌కతాకు చెందిన ర్యాపర్‌ ఆలపించిన యాసిడ్‌ దాడి బాధితురాలి కథ ఆమెపై ప్రభావం చూపింది. అయితే పాటలు రూపొందించడం, వాటిని రికార్డు చేయడం అంత సులభం కాలేదు. రికార్డింగ్‌ ఖర్చుల కోసం ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పాటలు రాయడం, ర్యాప్‌ రూపొందించడం కొనసాగించారు. ఈ ఏడాది జులైలో జరిగిన సీజేపీ నిరసనల్లోనూ పాల్గొని నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీపై తన గళం వినిపించారు. ఇలా సంగీత వేదికలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై జరిగే ఉద్యమాల్లోనూ మధుర భాగమవుతున్నారు. ప్రజల జీవితాలే పాటలుగా మారినప్పుడు సంగీతం వినోదాన్ని దాటి సామాజిక మార్పు కోసం ప్రశ్నించే గొంతుకగా మారుతుందని మధుర తన పాటల ద్వారా నిరూపిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్