ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లే అని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రవాసాంధ్రులు విజయాన్ని సాధించినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, మంచి పేరును సంపాదించినప్పుడల్లా రాష్ట్రం గర్వపడుతుందని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ ఆదివారం పాల్గొని మాట్లాడారు. మీరు వెళ్ళే ప్రతిచోటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనను తెలియజేసి పెట్టుబడులు పెట్టాలని కోరండని తెలిపారు. ఏ రంగంలోనైనా కలిసి పనిచేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఆవిష్కర్త కంపెనీని తాము ఆదరిస్తామని తెలిపారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. ఈ దేశానికి చెందిన శామ్‌సంగ్, హుందాయి, ఎల్‌జి, కియా వంటి ప్రఖ్యాత కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నాయని తెలిపారు. సంపద కేవలం ప్రకృతి వనరుల ఆధారంగా రాదని, శ్రమ, ఆవిష్కరణ, శాస్త్రీయ దృక్పథం, తపన ద్వారానే దేశాలు అభివృద్ధి పథంలో ముందుంటాయని దక్షిణ కొరియా నిరూపించిందన్నారు. కొన్నేళ్లలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు, షిప్ బిల్డింగ్, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉన్నత విద్య వంటి రంగాల్లో భారత్-దక్షిణ కొరియాలు మంచి ఫలితాలను సాధించాయని వివరించారు. దక్షిణ కొరియాకు భారతదేశంలో అత్యంత నమ్మకమైన భాగస్వామి కావడానికి ఎపి సిద్ధంగా ఉందన్నారు. వచ్చే దశాబ్దం ఎపి కేంద్రంగా భారత్-దక్షిణ కొరియా సంబంధాలు మరింత బలపడతాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. యువత అర్హతల ఆధారంగా నైపుణ్యాలు, అవకాశాలిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికోసం తాము విద్యా వ్యవస్థను సమగ్రంగా పునఃరూపకల్పన చేసుకుంటున్నామన్నారు.
భారత రాయబారితో లోకేష్ భేటీ
దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేష్ మర్యాదపూర్వ కంగా సమావేశమయ్యారు. శాంసంగ్, ఎల్‌జి, ఎస్‌కె, ఎఎస్‌ఐపి–ఎపిఎసిటి ఓశాట్‌ల ఆధారంగా, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎపి ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలను ఎపికి రప్పించేందుకు సహకారం అందించాలని దాస్‌ను లోకేష్ కోరారు. ఎపి –కొరియా మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. కొరియా ప్లస్, కొట్రా, భారత్-కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ఒక డెస్కు ఏర్పాటు చేస్తామన్నారు.








కామెంట్‌లు (0)