శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుర్రిపాలెంలో దళిత నేతపై దాడి ఆరోపణలు

4 గంటల క్రితం

బుర్రిపాలెంలో దళిత నేతపై దాడి ఆరోపణలు
-నామినేషన్ ఉపసంహరణకు నిరాకరించడంతో దాడి చేశారంటూ కుటుంబ సభ్యుల ఆవేదన
-కూటమి రెబల్ అభ్యర్థులు, పలు పార్టీల దళిత నేతల ధర్నా. తహశీల్దార్ హామీతో విరమణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 10:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నామినేషన్ ఉపసంహరణకు నిరాకరించడంతో దాడి చేశారంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

- కూటమి రెబల్ అభ్యర్థులు, పలు పార్టీల దళిత నేతల ధర్నా. తహశీల్దార్ హామీతో విరమణ

ప్రజాశక్తి - బుర్రిపాలెం: నామినేషన్‌ ఉపసంహించుకోవాలంటూ జరిగిన దాడిని నిరసిస్తూ మండలంలోని బుర్రిపాలెంలో బాధితుని కుటుంబీకులతోపాటు దళిత, ప్రజాసంఘాలు, పార్టీలు శనివారం ఆందోళన చేపట్టాయి. సర్పంచ్ స్థానానికి తన కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయించిన నల్లపు నీలాంబరం, వాటిని ఉపసంహరించుకునేందుకు నిరాకరించడంతో టిడిపికి చెందిన కొందరు నాయకులు ఆయనపై శుక్రవారం దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, పలు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నీలాంబరం చికిత్స పొందుతుండగా ఆయన కుటుంబీకులను కూటమి రెబల్ అభ్యర్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు శనివారం పరామర్శించారు. అనంతరం బుర్రిపాలెంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, భీమ్‌సేన సేవాదళ్‌ ‌నాయకులు ఎన్‌.నీలాంబరం, మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగుల చైతన్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి ఐక్యవేదిక అధ్యక్షుడు అక్కిదాసు కిరణ్ కుమార్, బిఎస్‌‌పి తెనాలి సమన్వయకర్త కారుమంచి సునీల్ సందీప్, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు యండ్రపాటి అశోక్ కుమార్, బొనిగల ప్రదీప్ తదితరులు ఆందోళనకు మద్దతుగా నిలిచారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను జీపులో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న తెనాలి తహశీల్దార్ కెవి.గోపాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో చర్చించారు. దాడి ఆరోపణలపై విచారణ చేసి జిల్లా కలెక్టర్, ఎస్‌‌పి దృష్టికి తీసుకెళ్తానని, బాధితుడికి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు నీలాంబరం భార్య మాట్లాడుతూ తన భర్త 14 ఏళ్లుగా టిడిపికి సేవలందించారని, ఆయనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో ఎన్నికలను నిలిపివేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను బుర్రిపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థి జెట్టి భారతి ఖండించారు. గ్రామంలో అల్లర్లు సృష్టించేందుకు వైసిపి అభ్యర్థులు యత్నిస్తున్నారని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని బుర్రిపాలెం ఎంపిటిసి కోడూరి రాజేష్ ఆరోపించారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.

​గ్రామానికి చెందిన వ్యక్తే దాడి చేశాడు : బాధితుడు నల్లపు నీలాంబరం

ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలాంరానికి సంబంధించిన వీడియో శనివారం బయటకు వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనపై దాడి చేసినట్లు వీడియోలో నీలాంబరం చెప్పారు. కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చారని, పార్టీ పేరు ప్రస్తావించవద్దని, కొందరి పేర్లు చెప్పకూడదని సూచిస్తూ బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని అన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్