- మంత్రి సంధ్యారాణి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హోంమంత్రి అనితపై చేసిన మేకప్ వ్యాఖ్యలకు వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని స్ర్తీ,శిశు, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి శనివారం గ్రీవెన్స్ నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు అమర్‌నాథ్‌ను మహిళా కమిషన్ పిలిచి విచారిస్తే, చేసిన తప్పును సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ముందుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన అమర్నాథ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం పోయిందన్న బాధ నుంచి వైసిపి నేతలు ఇంకా తేరుకోలేదన్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజధానిపై రోజుకొక మాట మారుస్తున్న మతిస్థిమితం ఉందా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. 'సూపర్ సిక్స్' పథకాలతో పాటు అన్ని శాఖల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ ఓర్వలేకపోతుందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)