- ప్రజల సందర్శనార్థం మూడు రోజులు టెహ్రాన్‌లోనే పార్థివ దేహాం
- లక్షలాది మందితో నిండిన నగరం
- హాజరుకాని మొజ్తాబా ఖమేనీ
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర శనివారం అధికారికంగా ప్రారంభమైంది. ఖమేనీతో పాటు మృతి చెందిన నలుగురు కుటుంబసభ్యుల శవపేటికలనూ ప్రజల సందర్శనార్థం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ఉంచారు. ఈ శవపేటికల్లో 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా ఉంది. దానిపక్కనే ఆ చిన్నారి ఫొటో ఫ్రేమ్‌ని ఉంచారు. అధికారులు ఖమేనీ పార్థివ దేహాన్ని ఒక గాజు పెట్టెలో ఉంచారు. ఖమేనీ శవపేటికను ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాతో కప్పి, దానిపై ఆయన నల్ల తలపాగానుంచారు. మక్కాలోని కాబాను పోలిన ఒక పెద్ద నల్ల వేదికపై, హత్యకు గురైన అతని కుటుంబ సభ్యులైన మరో నలుగురి శవపేటికలతో పాటు దానిని ఉంచారు. శనివారం గేట్లు తెరుచుకోగానే, వేలాది మంది ప్రాంగణంలోకి తోసుకుంటూ ప్రవేశించారు. క్షణాల వ్యవధిలోనే ఆ విశాలమైన ప్రాంగణంలోని భారీగా ప్రజలతో నిండిపోయింది. ఖమేనీకి నివాళులర్పిస్తూ వారంతా విలపించారు, కొందరు "మా మాట ఒక్కటే! ప్రతీకారం! ప్రతీకారం!" అని నినాదాలు చేశారు. కొందరు బ్యానర్లు, జెండాలు ప్రదర్శించారు, అలాగే, షియా ఆచారం ప్రకారం, పురుషుల గుంపులు సంతాప సూచకంగా లయబద్ధంగా తమ ఛాతీని బాదుకున్నారు. ఎర్ర జెండాలను పట్టుకుని, "అమెరికాకు మరణం", "ప్రతీకారం, ప్రతీకారం" అని నినాదాలు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ నిర్వహించిన సంయుక్తదాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల అనంతరం వీరి అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఇరాన్, ఇరాక్‌లోని ఐదు నగరాల్లో ఏడు రోజులు పాటు ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్‌లోని మషహద్‌లో ఈనెల 9న ఖననం చేయనున్నారు. శనివారం టెహ్రాన్‌లో ప్రారంభమైన అంతియ యాత్ర టెహ్రాన్‌లోనే మూడు రోజులు పాటు జరుగుతుంది. అంటే సోమవారం వరకూ శవపేటిక ఇక్కడే ఉంటుంది. మంగళవారం పవిత్ర నగరమైన ఖోమ్ కు చేరుకుని, ఆ తర్వాత ఇరాకీ నగరాలైన నజాఫ్, కర్బలాలకు చేరుకుంటాయి. ఈ కార్యక్రమాలు గురువారం మషద్‌లో ముగుస్తాయి. అక్కడే ఆయనను ఖననం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన భౌతికకా యాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు టెహ్రాన్‌కు లక్షలాది మంది తరలివచ్చారు. నగరం అంతటా ఉన్న హోర్డింగ్‌లపై ఖమేనీ చిత్రం కనిపించింది. భారీ జనసందోహం కదలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంలోపాటు, భారీస్థాయిలో భద్రతతా ఏర్పాట్లు చేశారు.
కనిపించని మొజ్తాబా ఖమేనీ..
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కుమారుడు మొజ్తాబా ఖమేనీ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అమెరికాతో యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి కనిపించని ఆయన.. ఇప్పుడు తండ్రి అంత్యక్రియలకూ రాకపోవడం గమనార్హం. అమెరికాతో ఒప్పందం కుదరినా పశ్చిమాసియాలో ఇంకా నెలకొన్న అస్థిరతలతో భద్రతాపరమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొజ్తాబా తన తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉంటారని ఇరాన్ ముందుగానే ప్రకటించింది.








కామెంట్‌లు (0)