శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పుల నుంచి వారసులు తప్పించుకోలేరు

1 గంట క్రితం

tg high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తెలంగాణ హైకోర్టు

ప్రజాశక్తి-హైదరాబాద్ : మరణించే ముందు వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పుల నుంచి వారసులు పూర్తిగా తప్పించుకోలేరని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. తండ్రి లేదా ముందు తరం వారు చేసిన అప్పుల బాధ్యత, వారసత్వంగా వచ్చిన ఆస్తులపై కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2005లోని చట్ట సవరణతో.. తండ్రి అప్పులను కుమారులు తమ వ్యక్తిగత ఆస్తులతో తీర్చాల్సిన బాధ్యత లేకపోయినా, వారసత్వ ఆస్తి మాత్రం అప్పు చెల్లింపులకు లోబడి ఉంటుందని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం 2005 సవరణలోని ఈ అర్థాన్ని న్యాయస్థానం స్పష్టంగా వివరించింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగితే, చట్టం ప్రకారం రికవరీ చర్యలు తీసుకోవడం సముచితమని అభిప్రాయపడింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద అధికారుల చర్యలు చట్టబద్ధమేనని చెబుతూ, కామారెడ్డి జిల్లాకు చెందిన యశోద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. యశోద భర్త జలాల్‌పూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా పనిచేసే సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్‌) నిధుల్లో రూ.14.89 లక్షలు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు అక్రమ వినియోగం జరిగినట్లు నిర్ధారించి, ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌లోని వ్యవసాయ భూములను జప్తు చేసి వేలం వేయడానికి నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ యశోద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్