ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో చెరువుల పూడ్చివేత, కొండల ధ్వంసంపై నిష్పాక్షిక విచారణ జరపాలి

20 నిమిషాల క్రితం

అమరావతిలో చెరువుల పూడ్చివేత, కొండల ధ్వంసంపై...
నిష్పాక్షిక విచారణ జరపాలి
-	రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్ శర్మ లేఖ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్ శర్మ లేఖ

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): రాజధాని అమరావతి ప్రాంతంలో చెరువుల పూడ్చివేత, కొండల ధ్వంసం, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌‌జిటి), సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఇఎఎస్.శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు, పిచ్చుకలపాలెం, నేలపాడు, అనంతవరం తదితర గ్రామాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఉన్నతస్థాయిలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌కు ఆయన లేఖ రాశారు. విచారణను రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి కూడా అప్పగించి, ఉల్లంఘనలపై నివేదికను ఎన్‌‌జిటికి సమర్పించాలని కోరారు. తాను దాఖలు చేసిన అప్పీల్ నెంబర్ 148/2015లో ఎన్‌‌జిటి 2017 నవంబర్ 17న ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తీర్పు ప్రకారం స్వతంత్ర నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర హైడ్రో జియోమార్ఫాలజీ అధ్యయనం నిర్వహించిన తర్వాతే జలాశయాలకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందన్నారు. 2006 ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రామాల్లోని చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తుళ్లూరు చెరువుకు చెందిన 33.06 ఎకరాల భూమిలో 65 మందికి, పిచ్చుకలపాలెం చెరువుకు చెందిన 11.25 ఎకరాల్లో 78 మందికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌‌పిఎస్) కింద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను తన లేఖలో ప్రస్తావించారు. ‘మీ భూమి’ అడంగల్, రీ-సెటిల్‌‌మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) రికార్డుల ప్రకారం ఆ భూములు చెరువులకు సంబంధించినవేనని, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత భూముల జాబితాలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. పిచ్చుకలపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 87, తుళ్లూరులోని సర్వే నెంబర్ 80, నేలపాడులోని సర్వే నెంబర్ 91లో ఉన్న చెరువులను పూడ్చివేయకూడదనే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు దొండపాడు చెరువును ఆక్రమించి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించారని, గ్రావెల్ అవసరాల కోసం అనంతవరం కొండను తవ్వి ధ్వంసం చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనులు పర్యావరణ నిబంధనలకు, న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తానే స్వయంగా ఎన్‌‌జిటిని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తానని శర్మ తన లేఖలో స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్