- వాహనాలకు నిప్పు, ఆస్తుల ధ్వంసం
ఈస్ట్ జెరుసలేం : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సెటిలర్లు ఆదివారం రెచ్చిపోయారు. పాలస్తీనా గ్రామాలపై దాడులు చేసి అనేక వాహనాలకు నిప్పు పెట్టి, ఆస్తులను ధ్వంసం చేశారు. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లా, ఎల్-బిరేహ్ ప్రావిన్సులలో ఇవి తీవ్రరూపం దాల్చాయి. వాహనాలను తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు పాలస్తీనీయుల నివాసాల గోడలపై జాత్యహంకార నినాదాలను స్ప్రే పెయింట్‌తో రాయడం వంటి చర్యలకు ఇజ్రాయిల్ సెటిలర్లు పాల్పడ్డారు. పాలస్తీనియన్ వార్తా సంస్థ 'వాఫా' నివేదికల ప్రకారం.. కాఫర్ మాలిక్, డీర్ అబూ మషాల్, డీర్ అల్ - సుదాన్ తదితర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మంటలు, పేలుళ్ల శబ్దాలతో భయబ్రాంతులకు గురైన స్థానికులు నిద్రలేచారు. సెటిలర్ల దాడులతో ఆందోళనకు గురై చుట్టుపక్కలకు పరుగులు తీశారు.
వెస్ట్ బ్యాంక్, గాజా స్ర్టిప్‌లో పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సెటిలర్లు దాడుల చేయడం ఇదే మొదటిసారి కాదు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయిల్ సైన్యంతో పాటు అక్కడి సెటిలర్ల దాడులు పెరిగిపోయాయి. ఈ ఏడాది సెటిలర్ల దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. పాలస్తీనా అథారిటీ సంస్థ ప్రకారం అక్టోబర్‌లో పాలస్తీనీయులపై 3,133 దాడులు జరగ్గా, వీటిలో 1,764 దాడులు ఇజ్రాయిల్ సైన్యం, 1,369 దాడులు సెటిలర్లు చేశారు. సెప్టెంబర్‌లో 2,051 జరిగాయి. వీటిలో 1,369 దాడులను సెటిలర్లు చేశారు.
ఆదివారం జరిగిన దాడులను యషార్ పార్టీ నాయకుడు గాడి ఐసెన్‌కోట్ తీవ్రంగా ఖండించారు. వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టడం ద్వారా చేసే విధ్వంసం ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని, ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుందని ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఇజ్రాయిల్ మానవ హక్కుల సంస్థకు చెందిన షాయ్ పార్నెస్ ఈ దాడులపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడుల సమయంలో ఇజ్రాయిల్ సైన్యం సెటిలర్లలకే రక్షణ కల్పిస్తుందని, కనీసం దాడులను ఆపడానికి కూడా ఏమీ చేయదని విమర్శించారు.







కామెంట్‌లు (0)