ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభివృద్ధి పేరిట విధ్వంసమా?

16 నిమిషాల క్రితం

అభివృద్ధి పేరిట విధ్వంసమా? 
- విశాఖలో భూములు, కొండలు, జలవనరుల పరిరక్షణకు చర్యలేవీ..
- సాగర తీరంలో గ్రీన్‌ విశాఖ ఆధ్వర్యాన ర్యాలీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విశాఖలో భూములు, కొండలు, జలవనరుల పరిరక్షణకు చర్యలేవీ..

- సాగర తీరంలో గ్రీన్‌ విశాఖ ఆధ్వర్యాన ర్యాలీ

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ‘అభివృద్ధి పేరిట విధ్వంసం వద్దు. డేటా సెంటర్ల ఏర్పాటును అభివృద్ధిగా ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, వాటి వల్ల పర్యావరణం, సహజ వనరులపై పడే ప్రభావాన్ని విస్మరిస్తోంది. విశాఖ నగరంలోని భూములు, కొండలు, రక్షిత ప్రాంతాలు, జంతుజాలం, జలవనరుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందే’ అంటూ విశాఖ బీచ్‌ రోడ్డులో గ్రీన్‌ ‌విశాఖ ఆధ్వర్యాన ఆదివారం ర్యాలీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాల్లో పౌరుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డేటా సెంటర్ల పేరిట ముడసర్లోవ సమీప కొండలను, తర్లువాడ, రాంబిల్లి తదితర ప్రాంతాల్లోని భూములను కార్పొరేట్‌ ‌సంస్థలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. విశాఖను ఆర్థిక రాజధాని, ఐటి రంగ హబ్‌‌గా మార్చుతామంటూ పర్యాటక ప్రాజెక్టుల పేరిట మరికొన్ని కొండలను పిండి చేస్తున్న విషయం విదితమే. డేటా సెంటర్లు, అభివృద్ధి ప్రాజెక్టులు, హోటల్స్‌, రిసార్టుల పేరిట జరుగుతున్న విధ్వంసం పట్ల విశాఖలోని మేధావులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్లకు పెద్ద మొత్తంలో నీరు అవసరం కానుండటంతో తాగునీటి సమస్యా విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆదివారం బీచ్‌ ‌రోడ్డులో తలపెట్టిన ర్యాలీ చైతన్యపూరితంగా సాగింది. ఈ సందర్భంగా గ్రీన్‌ విశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, పర్యావరణవేత్త జయశ్రీ హటాంగడి మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. డేటా సెంటర్ల వల్ల కలిగే పర్యావరణ ప్రభావం, ఉద్యోగాల కల్పన, నీటి వినియోగం తదితర అంశాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ప్రారంభంలో డేటా సెంటర్ల ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, 14 డేటా సెంటర్ల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పిందని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం ఆ సంఖ్యను పది వేల ఉద్యోగాలకు తగ్గించారని విమర్శించారు. ఉద్యోగాల సంఖ్య ఇంతగా తగ్గడానికి కారణాలేంటని ప్రశ్నించారు. తొలుత వాటర్‌ కూలింగ్‌ డేటా సెంటర్లుగా పేర్కొని, ప్రస్తుతం ఎయిర్‌ కూలింగ్‌ విధానాన్ని ప్రస్తావిస్తున్నారని అన్నారు. మొత్తం 14 డేటా సెంటర్లలో వాటర్‌ కూలింగ్‌ విధానంలో ఎన్ని, ఎయిర్‌ కూలింగ్‌ విధానంలో ఎన్ని పని చేస్తాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఎయిర్‌ కూలింగ్‌ విధానం వల్ల కలిగే ప్రభావాలు, వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోనున్న చర్యలను కూడా వివరించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు ముందుగానే పూర్తి సమాచారం అందించాలని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాల్లో పౌరుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలని సూచించారు. ర్యాలీలో గ్రీన్‌ విశాఖ ఉపాధ్యక్షులు డాక్టర్‌ రఘు, కోశాధికారి జి.కాంతారావు, హెచ్ఆర్‌ఎఫ్‌ ప్రతినిధి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్