- పంచాయతీ పోరుతో కూటమిలో తారాస్థాయికి విభేదాలు
- టిడిపి, జనసేన అధినేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో రాజకీయ చర్చ
- ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సిఎం చంద్రబాబు పిలుపు
- స్వేచ్ఛగా పోటీ చేయాలని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ నిర్దేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అధికార కూటమి పార్టీల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి మధ్య పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూటమి నేతల్లో ఐక్యత గురించి గొప్పగా చెప్పుకుంటున్నా కింది స్థాయిలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర భిన్నమైన వైఖరులు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల మధ్య సమన్వయంపై ఈ పరిణామాలు పలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఇరు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. జనసేనకు కేటాయించిన స్థానాల్లో టిడిపి నాయకులు సహకరించకపోవడం, కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు వినిపించాయి. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నచోట్ల టిడిపి నాయకులు స్వతంత్ర అభ్యర్థుల పేరుతో తమ మద్దతుదారులను పోటీకి దించారనే విమర్శలూ వచ్చాయి. దీంతో కూటమి ధర్మాన్ని టిడిపి నాయకత్వం పట్టించుకోవడం లేదని జనసేన నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలతోపాటు ఎంపిపి పదవుల కేటాయింపులోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీకి కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులకు టిడిపి నాయకులు సహకరించకపోవడం, ఎంపిపి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల విషయంలోనూ తగిన మద్దతు లభించకపోవడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తీసుకుంటున్న నిర్ణయాలు రెండు పార్టీల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద చోటుచేసుకున్న ఘటన ఈ విభేదాలను మరింతగా చర్చలోకి తెచ్చింది. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పరిశీలనకు వెళ్లిన జనసేన నాయకుడు ముంతల రామాంజులుపై టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి, మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరావు రెడ్డి అనుచరులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని జనసేన వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో రామాంజులు మృతిచెందడంతో ఇరు పార్టీల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఘటనపై ప్రశ్నించిన కడప జిల్లా జనసేన అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని, జనసేన శ్రేణులపై లాఠీ ఛార్జి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మృతదేహంతో నాగులగుట్టపల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించాయి. ఈ నిరసనలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా జనసేన నాయకుడు హరి రాయల్ కూటమి ధర్మాన్ని టిడిపి పాటించడం లేదంటూ తన బూట్లతో తనను తాను కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న అసంతృప్తి, ఒత్తిడి నేపథ్యంలోనే పవన్‌కల్యాణ్ పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసేందుకు అనుమతినిస్తూ ప్రకటన చేశారనే చర్చ జనసేన వర్గాల్లో సాగుతోంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజున పవన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానిక సంస్థల పదవులు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సహకారం విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గ్రామస్థాయిలో రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ క్రమంగా కూటమి పార్టీల మధ్య బహిరంగ అసంతృప్తికి దారితీస్తోంది. ముఖ్యమంత్రి ఏకగ్రీవ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తుండగా, జనసేన అధినేత తమ పార్టీ శ్రేణులకు స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కల్పించడం ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల వ్యూహాల్లో ఉన్న తేడాలను వెల్లడిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ విభేదాలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది.







కామెంట్లు (0)