అమరావతి : సిఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేయడం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా ఈ నూతన కమిషనరేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఐపిఎస్ అధికారుల నేతృత్వంలో ఈ కమిషనరేట్లు పూర్తిస్థాయి అధికారాలతో పనిచేయనున్నాయి. తాజా నిర్ణయంతో నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పర్యవేక్షణ, సైబర్ నేరాలు సహా ఆధునిక నేరాల నియంత్రణ మరింత వేగవంతం కానుంది. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు మంత్రివర్గం భారీగా నిధులను మంజూరు చేసింది. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ వంటి అత్యవసర మౌలిక వసతుల పనులను వేగవంతం చేసేందుకు రూ.1,548.98 కోట్ల వ్యయానికి కేబినెట్ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రాజధాని గ్రామాల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందనే స్పష్టమైన సందేశాన్ని ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం తెలియజేసింది.
నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లకు ఎపి కేబినెట్ ఆమోదం
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)