బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ ఆరోపణ తీవ్రంగా బాధిస్తోంది : సినీనటి అంబిక

1 గంట క్రితం

That allegation is deeply hurting me: Film actress Ambika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 02:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : రాధ గదిలోనికి వెళ్లి చెక్కులు దొంగతనం చేశానని తనపై ఆరోపణలు రావడం తీవ్రంగా బాధిస్తోందని సినీనటి అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.46 కోట్లు కాజేసేందుకు అంబిక, సోదరుడు మల్లికార్జున్‌ ప్రయత్నించారని నటి రాధ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుపై అంబిక స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అంబిక స్పష్టం చేశారు. కుటుంబ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. చిన్నతనంలో తోబుట్టువుల కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశానని తెలిపారు. అలాంటిది గదిలోంచి చెక్కు దొంగిలించానని తనపై నిందలు వేయడం చాలా బాధాకరమన్నారు. వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. రాధ తన వస్తువుల విషయంలోనూ, నంబర్ లాక్ ఉన్న బ్యాగుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుందని, అంత జాగ్రత్తగా ఉండే ఆమె (రాధ) దగ్గర నుంచి దొంగతనం చేయడం ఎలా సాధ్యమవుతుంది ? అని అంబిక ప్రశ్నించారు. ‘ఏఆర్‌ఎస్ గార్డెన్’ను తన కష్టార్జితంతో నిర్మించానని అంబిక తెలిపారు. ఎంజీఆర్ ఆశీస్సులతో ఆ పేరు పెట్టానన్నారు. దాని పేరును ‘ఆర్‌.ఆర్‌. గార్డెన్’గా మార్చడం, తనకు హక్కుగా రావలసిన వాటాలను నిరాకరించడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వెల్లడించారు. ఈ విషయాన్ని కుటుంబంలోనే పరిష్కరించుకోవడానికి పలుమార్లు ప్రయత్నించామన్నారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని చెప్పారు. చట్టాన్ని గౌరవిస్తూ దీనిపై బహిరంగంగా మరిన్ని వ్యాఖ్యలు చేయబోనని అంబిక తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్