అమరావతి : రాష్ట్రానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో సిఎం చంద్రబాబు రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలపై బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే 261 మండలాల్లో వచ్చే రెండు రోజుల పాటు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. వర్షాల తీవ్రత రీత్యా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు ముందస్తుగా సెలవు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో ప్రత్యేక సమీక్ష జరిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో ఉచిత ఆహారం, సురక్షిత తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. మూగజీవాలు వరదల్లో చిక్కుకోకుండా తగిన మేత సదుపాయాలు కల్పించి సురక్షిత ప్రాంతాలను కల్పించాలని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి నదులు, వాగులు, వంకల్లో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎస్, డీజీపీతో పాటు మంత్రులు, వివిధ శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించిన సిఎం.. రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. 261 మండలాల్లో వర్షాలపై ప్రత్యేక అంచనాలు ఉన్నందున 24, 25 తేదీల్లోనూ అప్రమత్తత కొనసాగించాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ... బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది కళింగపట్నానికి 100 కి.మీ, విశాఖపట్నానికి 180 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం – గోపాల్‌పూర్ (శ్రీకాకుళం-కవిటి ప్రాంతం) మధ్య ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముంది. ఆ సమయంలో గంటకు 50 నుంచి 85 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల వేళ ... అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 03:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)