ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత కోడ్ నిబంధనలకు (2026)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి శేషగిరి బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020) అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన అన్ని సంస్థలు రాష్ట్ర కార్మిక శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయాలి. నిర్ణీత గడువులో సర్టిఫికెట్ రాకపోతే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ మంజూరైనట్లుగా పరిగణిస్తారు. రిజిస్ట్రేషన్ వివరాల్లో మార్పులు ఉంటే 30 రోజుల్లోగా పోర్టల్‌లో నవీకరించాలి. తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ పొందిన సంస్థలపై షోకాజ్ నోటీసు అనంతరం రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం కల్పించారు. ప్రతి సంస్థ యజమాని ఉద్యోగుల వివరాలు, హాజరు, వేతనాలు, ఓవర్‌టైమ్, కోతలు, మహిళా ఉద్యోగుల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించాలి. ఉద్యోగుల రిజిస్టర్, హాజరు–మస్టర్ రోల్, వేతనాలు, అడ్వాన్స్‌లు, జరిమానాల రిజిస్టర్, మహిళా ఉద్యోగుల రిజిస్టర్ ఈ రికార్డులను ఎలక్ట్రానిక్ లేదా భౌతిక రూపంలో నిర్వహించవచ్చు. చివరి నమోదు చేసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వేతన స్లిప్‌ను వేతన చెల్లింపుకు కనీసం 24 గంటల ముందు అందించాలి. వార్షిక రిటర్నులు తప్పనిసరి, సంస్థ విక్రయం, మూసివేత, కార్యకలాపాల నిలిపివేత జరిగితే అదనపు రిటర్న్ సమర్పించాల్సి ఉంటుంది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది. నాన్-ఎక్స్‌అఫిషియో సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు. గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే సభ్యులుగా కొనసాగవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. కార్మిక సంక్షేమం, న్యాయం, ఆర్థిక, పరిపాలనా రంగాల నిపుణులకు అవకాశం ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ సొసైటీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొసైటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కార్మిక, ఆరోగ్య, ఆర్థిక శాఖల అధికారులు, ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల గ్రాట్యుటీ హక్కుల రక్షణకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఉద్యోగులు ఫారం–1 ద్వారా నామినేషన్ ఇవ్వాలి. గ్రాట్యుటీ దరఖాస్తును సాధారణంగా 30 రోజుల్లో సమర్పించాలి. యజమాని 15 రోజుల్లో అర్హత పరిశీలించి నిర్ణయం తెలియజేయాలి. చెల్లింపులు డిజిటల్ విధానం, బ్యాంకు ఖాతా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయవచ్చు. మైనర్ నామినీ లేదా వారసుడికి రావాల్సిన మొత్తాన్ని జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా భద్రపరచాలి. ప్రసూతి ప్రయోజనాల కోసం కొత్త నిబంధనలు రూపొందించారు. గర్భధారణ, ప్రసవం, గర్భస్రావం వంటి సందర్భాలకు ధృవీకరణ పత్రాలు అవసరం. పని చేసే తల్లులకు రోజుకు రెండు పాలిచ్చే విరామాలు ఇవ్వాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో క్రెచ్ సౌకర్యం కల్పించాలి. క్రెచ్‌లో పిల్లలకు భద్రత, ఆహారం, వైద్య సదుపాయాలు ఉండాలి. ఉద్యోగి ప్రమాద పరిహారం 30 రోజుల్లో చెల్లించకపోతే యజమాని సంవత్సరానికి 12 శాతం సాధారణ వడ్డీ చెల్లించాలి. అంత్యక్రియల ఖర్చు కోసం యజమాని సమర్థ అధికారికి రూ.20 వేలు జమ చేయాల్సి ఉంటుంది.
సామాజిక భద్రత కోడ్ నిబంధనలకు ఆమోదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 10:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)