నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక
రైతుల ఖాతాల్లోకి నేడు రూ. 6 వేలు
అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే
మంత్రివర్గ సమావేశంలో సిఎం చంద్రబాబు
48 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అర్నబ్ తుపాన్ కారణంగా 4,563 కోట్ల నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ముందుగానే అప్రమత్తం కావడం వల్ల భారీ ప్రాణనష్టాన్ని నివారించగలిగామని అయన వ్యాఖ్యానించారు. గురువారం హైబ్రిడ్ తరహాలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారికంగా చర్చల సారాంశాన్ని వెల్లడించలేదు. అనధికారికంగా అందిన సమాచారం మేరకు అర్నబ్ పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసేందుకు శుక్రవారం కేంద్రబృందం వస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.2 వేలు, రాష్ట్రం నుంచి రూ.4 వేలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో శుక్రవారం జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.3,120 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి అప్రమత్తం చేయడం వల్లే అధికారులు కూడా అలెర్ట్ అయ్యారని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనివలన ఆస్తి, ప్రాణ నష్టం తగ్గిందని అన్నారు. తాను కూడా రేపు తూర్పు గోదావరికి వెళ్లి సమీక్ష నిర్వహిస్తానన్నారు. అర్నబ్ తుపాన్ కారణంగా మరణించిన వారికి కేబినెట్ సమావేశంలో సంతాపం తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్, కోస్తాకు తుపాన్లు ఎక్కువగా వస్తున్నాయని, ప్రస్తుతం రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలించి అక్కడ ఉద్యాన పంటలు పండిస్తున్నామని, కోస్తా లో కూడా తుపాన్ లు వస్తున్నా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. తుపానులో పడవలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అచ్చెన్నాయుడు తెలిపారు. పడవలు నష్టపోయినవారికి కేంద్ర సాయంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం చేద్దామని చంద్రబాబు చెప్పారు.
బాధ్యత మంత్రులదే
తాజా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని, రెండో ఆలోచనకు ఆస్కారం లేదని స్పష్టంచేశారు. అభ్యర్థిని చూసి కాదని, కూటమిని చూసి ఓటు వేయాలన్నారు. పవన్ కల్యాణ్, మాధవ్, తానూ కూర్చొని సీట్ల సర్దుబాటు చేశామని గుర్తు చేసారు. తమ ఉమ్మడి సందేశాన్ని ప్రజలకు, అభ్యర్థులకు, పార్టీ కేడర్ లకు పంపామని చెప్పారు. జనసేన, బిజెపి నుంచి తలెత్తుతున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ తరపున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయాలని చంద్రబాబు తేల్చిచెప్పారు. మంత్రులు తమ నియోజకవర్గాల తో పాటు ఇన్ఛార్జిలుగా ఉన్న జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయని, ఇప్పటినుంచే అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఆ తర్వాత మొత్తం పాలనపై దృష్టి పెడదామని అన్నారు. మంత్రులు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ నేరుగా కాబినెట్ కు హాజరు కాగా మిగిలిన మంత్రులు వారివారి జిల్లాలనుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పాల్గొన్నారు.







కామెంట్లు (0)