భారత్‌లో అవసరం లేదని వాదన
న్యూఢిల్లీ: సాంస్కృతిక సంస్థగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భారత్‌లో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా శతాబ్దకాలంగా కార్యకలాపాలను సాగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగ దిక్కరణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ సంస్థ అమెరికాలో ‘ఆర్‌ఎస్‌ఎస్ ఫ్రెండ్స్’ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా వెళ్లిన రెండు రోజుల్లోనే ఈ సంస్థ అమెరికా న్యాయ శాఖ వద్ద నమోదైనట్లు, విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం (ఫారా) కింద దాఖలైన పత్రాల్లో వెల్లడైంది.
ఈ పత్రాల ప్రకారం, ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈ సంస్థ తన ‘ప్రధాన విదేశీ సంస్థ’గా పేర్కొంది. జార్జియా రాష్ట్రం పీచ్‌ట్రీ కార్నర్స్ చిరునామాను రిజిస్ట్రెంట్‌గా ఇచ్చింది. సమాచార, విద్యా, ప్రజా సంబంధాలు, సమాజ భాగస్వామ్య కార్యక్రమాలే తమ ప్రధాన పని అని తెలిపింది. జర్నలిస్టులు, పరిశోధకులు, పౌర సమాజ సంస్థలతో పాటు అవసరమైతే ప్రభుత్వ సంస్థలు, అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడం, దాని కోసం లాబీయింగ్ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే, తమ కార్యకలాపాల్లో రాజకీయ కార్యకలాపాలు ఉంటాయా అన్న ప్రశ్నకు ‘కాదు’ అని సమాధానమిచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ను హిందూ సాంస్కృతిక, సామాజిక సేవ, విద్యా కార్యకలాపాల్లో నిమగ్నమైన స్వచ్ఛంద సంఘంగా చెప్పుకొచ్చింది. ఈ పత్రాలపై రాజేంద్ర సోనారికర్, జయంత్ పంత్ సంతకాలు చేశారు.
చట్టానికి అతీతమైన శక్తి?
ఆర్‌ఎస్‌ఎస్ భారత్‌లో నమోదుకు నిరాకరిస్తూనే, తన అనుబంధ సంస్థల్లో చాలావాటిని వివిధ దేశాల్లో నమోదు చేయించిందని ‘ది వైర్’ నివేధించింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా శాఖలను ఏర్పరుచుకుని శతాబ్దకాలంగా కార్యక్రమాలను, వేల కోట్ల రూపాయల లావాదేవీలను నిర్వహిస్తుంది. కానీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించ లేదని పలువురు చెబుతున్నారు. అలాగే, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ భారత్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, దీనిపై విపక్షాలు ప్రశ్నిస్తే. దీనికి స్పందనగా, ‘‘హిందూ మతానికి రిజిస్ట్రేషన్ ఉందా?’’. లేదు కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి నమోదు అవసరం లేదని ఆర్ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ వాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఇతర దేశాల్లో కూడా హిందూ మతానికి రిజిస్ట్రేషన్ లేదు, మరి ఎందుకని ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను నమోదు చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. చట్టానికి అతీతమైన శక్తిగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవహిరిస్తుందని, నిత్యం ప్రజల మధ్య విద్వేషాన్ని రగల్చడానికి రాజ్యాంగం ఆర్ఎస్‌ఎస్‌కు ఆటంకంగా ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.







కామెంట్‌లు (0)