నేడు న్యూజిలాండ్‌తో నాల్గో టి20
మధ్యాహ్నం 12.30గం.లకు
ఆక్లాండ్: టి20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచుల్లో సంచలన విజయాలను నమోదు చేసుకున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారతజట్టు శుక్రవారం జరిగే నాల్గో టి20లోనూ గెలుపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా మూడో టి20లో ఓపెనర్లు రికార్డు భాగస్వామ్యాలతో ఆతిథ్య కివీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించడంతో నాల్గో టి20కి ప్రాధాన్యత సంతరించుకుంది. యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కివీస్ అభిమానులు మైదానానికి తరలి రానున్నారు. ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. 40 వేల మందికి పైగా సామర్థ్యంగల ఈ మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోనుంది. అలాగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు తొలి మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలబడటంతో, తదుపరి రెండు మ్యాచుల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. కివీస్ మైదానంలో జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌కు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కావడం ఇది ఒక కొత్త రికార్డు కానుందని న్యూజిలాండ్ బోర్డు వెల్లడించింది. ఇక మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లు టి20 ఫార్మాట్‌లో క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచాయని, వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే అద్భుతమైన 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 19 బంతుల్లో 45 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ యువ ద్వయం తొలి వికెట్‌కు కేవలం ఆరు ఓవర్లలోనే 118 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో కివీస్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే చేధించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. నాల్గో టి20 జరిగే ఈడెన్ పార్క్ మైదానం కూడా పరిమాణంలో చిన్నది కావడంతో, మరోసారి బ్యాటర్ల విధ్వంసం ఖాయం. చిన్న బౌండరీల కారణంగా పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇది మ్యాచ్‌కు మరింత ఉత్సాహాన్నివ్వనుంది. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్నా.. నాల్గో టి20 టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవ్వడం విశేషం.
ఫెర్గూసన్‌కు గాయం
నాల్గో టి20కి ముందు ఆతిథ్య న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కండరాల గాయం కారణంగా మిగిలిన రెండు టి20లకు దూరమయ్యాడు. తొలుత మూడో టి20కి మాత్రమే దూరమైన ఫెర్గూసన్.. 30న జరిగే నాలుగో టి20 నాటికి కోలుకుంటాడని కివీస్ యాజమాన్యం భావించింది. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో మిగిలిన రెండు టి20ల నుంచి అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో ఫెర్గూసన్ స్థానంలో బ్యాకప్‌గా వచ్చిన 26 ఏళ్ల యంగ్ పేసర్ మాథ్యూ ఫిషర్‌ను మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ కొనసాగించనున్నారు. లాకీ ఫెర్గూసన్ ఒక్కడే కాకుండా, మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ కూడా తొడ కండరాల గాయం వల్ల ఈ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
జట్లు(అంచనా)...
ఇండియా: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యవంశీ, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, ప్రిన్స్ యాదవ్, ఆర్ష్‌దీప్/మయాంక్ యాదవ్.
న్యూజిలాండ్:సాంట్నర్(కెప్టెన్), షెఫర్ట్ (వికెట్ కీపర్), అలెన్, మిఛెల్, ఫిలిప్స్, జాకోబ్స్, బ్రాస్‌వెల్, స్మిత్, మిల్నే, డఫీ, ఫిషెర్.







కామెంట్‌లు (0)