ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅతి తీవ్ర తుపానుగా ‘అర్నబ్‌’

1 గంట క్రితం

​         అతి తీవ్ర తుపానుగా ‘అర్నబ్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం

ప్రజాశక్తి- ‌యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ప్రఖర్‌ ‌జైన్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్నబ్‌ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ వాయుగుండం ఆదివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28వ తేదీ ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వివరించారు. అదే రోజు మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసినట్లు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘అర్నబ్‌’తో అప్రమత్తంగా ఉండాలి : సమీక్షలో మంత్రులు గొట్టిపాటి రవి, అనిత

అర్నబ్ తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కంల సిఎండిలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో ఆదివారం వారు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్నబ్‌ తుపాను నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం నుంచి డిస్కంల సిఎండిలు, డైరెక్టర్లు అక్కడే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

గుంటూరులో భారీ వర్షం

గుంటూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా మురుగు కాల్వలోకి వెళ్లటంతో డ్రెయినేజీలు పొంగి పార్లాయి. పట్టాభిపురం ప్రధాన రహదారి మురుగు నీటితో మునిగిపోవటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. కాకినాడ జిల్లా తుని, తొండంగి, యు.కొత్తపల్లి, డాక్టర్‌ ‌బిఆర్‌.అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం, రాజోలు, మలికిపురం, ఐ.పోలవరం, సఖినేటిపల్లిల్లో చిరు జల్లులు పడుతున్నాయి.

పాకల సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న అలలు

ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రంలో అలల తీవ్రత ఉధృతంగా ఉండడంతో మత్స్యకారులు వేట నిలిపివేసి వలలను, బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో మెరైన్ పోలీసులు ఎవరినీ సముద్రం వైపు రానివ్వకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్