సిపిఎం మేయర్ అభ్యర్థి శ్యామలకు ఒక్క అవకాశం ఇవ్వండి
విజయవాడ మోడల్ అభివృద్ధి చేసి చూపుతాం : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు తీవ్ర వివక్షకు గురైందని, నిర్లక్ష్యం చేయబడిందని, రాష్ట్ర స్థాయి ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని ఇక్కడకు తీసుకురాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కర్నూలు సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జోన్లు, కారిడార్లు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. కర్నూలు నగరంలో ప్రతి వీధీ మురికివాడలా కనిపిస్తోందని, ఇది పాలకుల వైఫల్యాన్ని చూపిస్తోందని తెలిపారు. అవినీతి కంపు కొడుతోందని, లంచం లేనిదే ఏ పనీ జరగడం లేదని, డబ్బులిచ్చి, కులం, మతం పేరుతో ఓటర్లను మభ్యపెట్టాలని టిడిపి, వైసిపి చూస్తున్నాయని విమర్శించారు. పిపిపి కింద అన్నిటినీ ప్రయివేటుకు ఇచ్చేసేలా జిఒ తెచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే మొదట మున్సిపాల్టీల్లోనే ప్రయివేటీకరణ జరుగుతుందని చెప్పారు. కర్నూలు నగరం సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వామపక్షాలకు ఒక్క అవకాశం ఇస్తే విజయవాడ తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మేయర్‌గా సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అరాచకాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను చెబుతూనే ‘అతనికంటె ఘనుడు ఆచంటి మల్లన్న’ అనే తరహాలో అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ కన్నా తాను ఘనుడనని చెప్పడం సిఎం ఉద్దేశమన్నారు. ఇటీవల చంద్ర బాబు మీడియాతో మాట్లాడుతూ వైసిపిని గొడ్డలి పార్టీ అంటూనే అలాంటి అరాచకాలే సృష్టించే పార్టీలా టిడిపిని మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారని అర్థమైనందునే ఇతరులను నామినేషన్లు వేయనీయకుండా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగనీయకుండా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో వైసిపి తరఫున గెలిచిన వారిని టిడిపిలో చేర్చుకున్నప్పుడు టిడిపి నాయకుల హార్ట్ బర్న్ అవ్వలేదా? అని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో నామినేషన్లు వేయలేని పరిస్థితి ఉందని డిజిపినే స్వయంగా చెప్పారన్నారు. లోకేష్ కార్యాలయం నుంచే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వస్తున్నాయని, ఇవి అర్గనైజ్డ్ క్రైం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు స్వేచ్ఛగా వేయనిస్తారా అనే సందేహం వ్యక్తం చేశారు. మరింత రెచ్చగొట్టడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. మూడో రోజు పోలీసులే తీసుకెళ్లి నామినేషన్లు వేయించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని, దానికి ముఖ్యమంత్రి గర్వపడతారా, వాళ్ల పార్టీ నాయకులను అదుపు చేయలేరా? అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా ఓట్లు వేయగలిగే పరిస్థితి ఉంటేనే ప్రజాస్వామ్యం అంటుందని, పోలీసుల దయతో ప్రజాస్వామ్యం నడపడం సిగ్గు చేటన్నారు. 19 చోట్ల సిపిఎం, సిపిఐ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అరాచకాలు సృష్టించారని, మహిళలపై దాడులు చేశారని, సిపిఎం చిత్తూరు జిల్లా కన్వీనర్‌ను కిడ్నాప్ చేశారని, దీనిని ప్రజాస్వామ్యం అంటారా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.1500 చెల్లింపు, వడ్డీ మాఫీ అమలు చేయలేదని, డిఎస్సి తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అమిత్ షా, మోడీ ఆదేశాలు అమలు చేయడం తప్ప, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, అందుకే ఎన్నికలు స్వేచ్ఛగా జరగనివ్వడం లేదని వివరించారు. వైసిపి, టిడిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవన్నారు. సర్‌ను అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, ఓట్ల తొలగింపునకు ప్రత్యేక ప్రోగ్రాం తయారు చేశారని విమర్శించారు. సర్‌ను అమలు చేయడం అంటే ప్రజాతీర్పును వమ్ము చేయడమేనని, ప్రజాస్వామ్యా న్ని తుంగలో తొక్కడమేనని తెలిపారు.
గతంలో సిపిఎం ఎమ్మెల్యే హయాంలోనే అభివృద్ధి : కె రామాంజనేయులు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఉభయ కమ్యూనిస్టుల అభ్యర్థిగా సిపిఎం పార్టీ తరఫున బి శ్యామలను గెలిపించాలని కోరారు. వైసిపి, టిడిపి ప్రభుత్వాల్లో నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. గతంలో సిపిఎం ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్ హయాంలోనే కర్నూలు నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. కర్నూలు నగరంలో మేయర్ గా బి.శ్యామలను గెలిపిస్తే నగర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సిపిఎం మేయర్ అభ్యర్థి బి శ్యామల మాట్లాడుతూ నగరంలో మురికి కాలువల్లో పైపులైన్లు ఉన్నాయని, తాగునీరు కలుషిత అవుతోందని తెలిపారు. శివారు ప్రాంతాల్లో పార్కులు అన్యాక్రాంతం అవుతున్నాయని, తనను గెలిపిస్తే నగర అభివృద్ధికి పాడుపడతామన్నారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు.







కామెంట్లు (0)