ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిజెపికి విధేయుడుగా మాజీ సిజెఐ చంద్రచూడ్‌

1 గంట క్రితం

chandrachood.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:37 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కొలీజియం నియామకాలపై ముందే సంప్రదింపులు

  • ఆత్మకథలో సుప్రీం మాజీ జడ్జి సంజయ్ కిషన్ కౌల్

  • మోడీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వతంత్ర్యంపై కాంగ్రెస్‌ ప్రశ్నలు

న్యూఢిల్లీ : మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రభుత్వానికి వినయంగా ఉండేవారని, అతి విధేయతను ప్రదర్శించేవారని సుప్రీంకోర్టు మాజీ జడ్జీ సంజయ్‌ ‌కిషన్‌ ‌కౌల్‌ ‌విమర్శించారు. కొలీజియం సమావేశాలకు ముందే నియామకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవారని, నియామకాల ఆమోదానికి అనుమతి కోసం ఎదురు చూసేవారని పేర్కొన్నారు. అలాగే, మైనారిటీ మతానికి చెందిన జడ్జీ అభ్యర్థి కులానికి సంబంధించి ప్రభుత్వం అడిగిన అన్యాయమైన ప్రశ్నకు కూడా చంద్రచూడ్‌ ‌సమాధానం ఇచ్చారని తెలిపారు. తన ఆత్మకథ ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల చివరలో జగ్గర్‌నాట్ సంస్థ ఈ పుస్తకాన్ని విడుదల చేయనుంది. ప్రచురణకు ముందు సమీక్షించిన రాతప్రతి వివరాల ప్రకారం.. తన పదవీ కాలంలో జరిగిన పలు కీలక అంశాలను జస్టిస్‌ ‌కౌల్‌ ‌వెల్లడించారు.

ఏవరు ఈ జస్టిస్‌ ‌కౌల్‌?

సుప్రీంకోర్టు జడ్జీగా పని చేసిన ‌జస్టిస్‌ ‌కౌల్‌ 2023 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. సిజెఐ తరువాత అత్యంత సీనియర్ జడ్జి అయిన కౌల్‌ “జె1”గా ‌గుర్తింపు తెచ్చుకున్నారు. 2022 నవంబర్‌ ‌నుంచి 2024 నవంబర్‌ ‌వరకూ చంద్రచూడ్‌ ‌సిజెఐగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వ హయంలో సుప్రీంకోర్టు వ్యవహారంపై చర్చ జరుగుతున్న తరుణంలో జస్టిస్‌ ‌కౌల్‌ ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే, ‘వెన్నెముక ఉన్న జడ్జీలపై ప్రభుత్వానికి చాలా ఎక్కువ గౌరవం ఉందని నేను కనుగొన్నాను, ‘తమను తాము గౌరవించుకునే జడ్జీలను ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది’ అని అని కౌల్ ఈ పుస్తకంలో తెలిపారు. సుప్రీంకోర్టు సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించిన సందర్భాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

సమావేశాలకు ముందే ప్రభుత్వంతో సంప్రదింపులు..

2022 జూన్‌‌లో తాను కొలీజియంలో సభ్యుడైన తర్వాత జరిగిన ఒక సమావేశం గురించి వెల్లడిస్తూ.. ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సమావేశం జరిగిందని తెలిపారు. అయితే ‘‘ఆ రోజు, సమావేశానికి వెళ్తుండగా, ధన్ (సిజెఐ చంద్రచూడ్) ఆరవ పేరును ప్రతిపాదించారు. ఇతర న్యాయమూర్తులు దానిని వ్యతిరేకించారు. ప్రభుత్వం ప్రోత్సాహంతోనే ఆరో పేరును ప్రతిపాదించారని నాకు అనుమానం కలిగింది’’ అని తెలిపారు. ‘అప్పుడు సిజెఐ నన్ను ఒక ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి, ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవడానికి ఫోన్ చేయాలా? వద్దా? అని తీవ్రంగా ఆలోచించాను’’ అని చెప్పారు. ‘నా అనుమానాలు నిజమని తేలాయి, దీంతో అతనికి బుద్ధి చెప్పాను. ఒక కొలీజియం సమావేశం మధ్యలో ఇలాంటి పని చేయకూడదు’ అని జస్టిస్‌ ‌కౌల్‌ ‌తెలిపారు. చివరికి ఐదు పేర్లు మాత్రమే ఆమోదం పొందాయని గుర్తు చేశారు.

కొలీజియం ఒత్తిళ్లకు అతీతమన్నది భ్రమ..

ఒక మైనార్టీ మతానికి చెందిన ఒక జడ్జీ అభ్యర్థిత్వంపై జరిగిన విచారణ గురించి కౌల్‌ ‌తెలిపారు. ఇతర మైనారిటీ మతాలకు చెందిన న్యాయమూర్తులు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నారని, మైనారిటీ మతాలకు మరింత ప్రాతినిధ్యం అవసరమా అని సిజెఐ ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ సమయంలో ఆ మైనారిటీ అభ్యర్థి కుటుంబానికి సంబంధించిన కులంపై చర్చ వచ్చిందని, అది తనకు ‘‘చాలా వింతగా’’ అనిపించిందన్నారు. ప్రభుత్వ అభిప్రాయంగా సిజెఐ ఆ విషయాన్ని తనతో పంచుకున్నారని, ఆ పేరును తొలగించాలని తెలిపారు. ‘న్యాయమూర్తులను ఈ విధంగానే నియమించుకుంటుంటే. కొలీజియం ఎందుకని ప్రశ్నించాను. కొలీజియం ఏర్పడక ముందు ప్రధాన న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించేవారు. మీరు ఆ విధంగానే చేయవచ్చు. నేను ఇలాంటి నిర్ణయంలో భాగస్వామి కాలేను’ అని చెప్పి సమావేశం నుంచి వాకౌట్‌ ‌చేసినట్లు కౌల్‌ తెలిపారు. తన వాకౌట్‌ ‌తరువాత సమావేశాన్ని వెంటనే వాయిదా వేశారని, ఎట్టకేలకు ప్రభుత్వం ఆ అభ్యర్థిని ఎంపిక చేసిందని ఆయన పుస్తకంలో రాశారు. కానీ,“నియామక ప్రక్రియ వాస్తవికత ఇదే. కొలీజియం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా ఉంటుందని భావించడం ఒక భ్రమ. ప్రభుత్వాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. మీరు వారికి ఒక అవకాశం ఇస్తే, దాన్ని అందిపుచ్చుకుంటాయి. ఈ ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే సంస్థాగత సమగ్రతను కాపాడుకోవడమే అసలైన సవాలు. నిజానికి, ఇటువంటి విషయాలలో వెన్నెముకలాంటి వైఖరి, సమతుల్యత అవసరం ఉన్న న్యాయమూర్తుల పట్ల ప్రభుత్వానికి చాలా ఎక్కువ గౌరవం ఉందని నేను కనుగొన్నాను” అని కౌల్ రాశారు. అలాగే, “ఒక ధర్మాసనం ఎలా తీర్పు ఇస్తుందోనన్న అనుమానాల కారణంగా కేసులు ఒక ధర్మాసనం నుండి మరొక ధర్మాసనానికి బదిలీ కాకూడదు” అని జస్టిస్‌ ‌కౌల్‌ ‌తెలిపారు.

కాగా, జస్టిస్‌ కౌల్‌ ‌వ్యాఖ్యలపై స్పందించడానికి మాజీ సిజెఐ చంద్రచూడ్ నిరాకరికంచారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆత్మకథపై కాంగ్రెస్‌ ‌స్పందిసూ ‘మోడీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్) జైరామ్ రమేష్ ఈ మేరకు ఎక్స్‌‌లో ఒక పోస్టు చేశారు. ‘ఆశ్చర్యకరంగా, న్యాయ నియామ కాలకు ముందు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయనే విష యాన్ని మాజీ సిజెఐతో సహా ఎవరూ ఖండించలేదు. ప్రభు త్వం సిజెఐతో సంప్రదింపులు జరుపుతుందని, నియామక ప్రక్రియలో పాత్ర పోషిస్తుందని మాజీ సిజెఐ చంద్రచూడ్ అంగీకరించినప్పుడు, న్యాయ స్వాతంత్ర్యంపై ఆందోళనలు మరింత తీవ్రమవుతాయి’’ అని రమేష్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్