సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్
సంఘ్‌పరివార్ రాజకీయాలకు అనుగుణంగా చరిత్ర వక్రీకరణ
ఏకరూప చరిత్రను, సంస్కృతిని ప్రజలపై రుద్దే ప్రయత్నం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చరిత్రను హిందూ రాష్ట్ర స్థాపనకు ఆయుధంగా మార్చే ప్రయత్నాలను అప్రమత్తంగా ప్రతిఘటించాలని ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రొమిలా థాపర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సంఘ్‌పరివార్ తప్పుడు చరిత్రను సృష్టించి, దానిని దేశ అధికారిక చరిత్రగా చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో స్మారకోపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా “చరిత్ర రచన - ప్రాచీన భారతదేశ చరిత్ర” అంశంపై ప్రొఫెసర్ రొమిలా థాపర్ మాట్లాడారు. హిందూత్వ సిద్ధాంతానికి పదునైన ఆయుధంగా చరిత్రను పునర్నిర్మించేందుకు, వక్రీకరించేందుకు ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విశ్వసనీయమైన ఆధారాలు లేని కల్పిత చరిత్రను వ్యతిరేకించే చరిత్రకారులు, పరిశోధ కులను కమ్యూనిస్టులుగా ముద్రవేస్తు న్నారని పేర్కొన్నారు. దేశంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని దెబ్బతీసి, ఏకరూప చరిత్రను, సంస్కృతిని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
భారత దేశ చరిత్రను హిందూ, ముస్లిం ఘర్షణల చరిత్రగా చిత్రీకరించిన జేమ్స్ మిల్ వంటి వలసవాద చరిత్రకారులు అనుసరించిన బాటలోనే తీవ్ర హిందూత్వవాదులు పయనిస్తున్నారని ఆమె తెలిపారు. ముస్లిం పాలకులు భారతదేశానికి రాకముందు వరకు దేశం సుదీర్ఘ స్వర్ణయుగంలో ఉందని, ప్రపంచంలోని అన్ని రంగాల విజయాలు ఆ కాలంలోనే సాధ్యమయ్యాయని వంటి తప్పుడు చారిత్రక వ్యాఖ్యానాలతో వారు సిలబస్‌లను, పాఠ్యప్రణాళికలను నింపుతున్నారని తెలిపారు. చరిత్రను తప్పుగా ప్రచారం చేస్తూ, ఇటువంటి తప్పుడు చరిత్రను విద్యార్థుల మెదళ్లలోకి చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అబద్ధాలు అసత్యమని, ఈ వాదనలు తప్పని నిరూపించే అనేక చారిత్రక ఆధారాలు, ఉదాహరణలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో దేనినీ అంగీకరించేందుకు వారు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తాము చరిత్రకారులమని చెప్పుకుంటూ, కల్పిత చరిత్రను రచిస్తున్నవారే ఈ ప్రయత్నాల వెనుక ఉన్నారని, వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని అన్నారు.
శాస్త్రీయ ఆధారాలతో చరిత్ర రచన
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నా యని రోమిలా థాపర్ వివరించారు. పురావస్తు శాస్త్రం, భాషాశాస్త్రం, జన్యుశాస్త్రం వంటి వివిధ విజ్ఞాన శాస్త్రాల నుంచి లభిస్తున్న ప్రాథమిక ఆధారాలను ఉపయోగించి మరింత ప్రామాణికమైన చరిత్రను నిర్మించేందుకు పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న భావజాలానికి సంబంధించిన రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వా మ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించేందు కు సాగించే విస్తృత పోరాటంలో భాగంగానే ఈ ప్రతిఘటనను చూడాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీతారాం ఏచూరి సతీమణి, ఏచూరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ సీమా చిస్తీ, ప్రొఫెసర్ సిపి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ప్రముఖంగా నిలిచిన మలయాళీ విద్యార్థిని, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త పి. పవిత్రతో పాటు, ఆమె నిరసన చిత్రాన్ని తీసిన మలయాళ మనోరమ పిక్చర్ ఎడిటర్ జోసుకుట్టి పనయికల్‌ను ఈ సందర్భంగా సత్కరించారు.








కామెంట్‌లు (0)