సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవణికిస్తున్న ‘అర్నబ్‌’

1 గంట క్రితం

FISHNG HARBOUR (1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • యానాం సమీపంలో రేపు తీరాన్ని దాటే అవకాశం

  • ఆందోళనలో తీరప్రాంతవాసులు, అన్నదాతలు

  • నేడు, రేపు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

​ప్రజాశక్తి- యంత్రాంగం : ‘అర్నబ్‌’ తుపాను దూసుకొస్తోంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని, ఈదురు గాలులు బలంగా వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించడంతో తీరప్రాంతవాసులు, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాపట్ల బీచ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం సాయంత్రానికి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నానికి 540 కిలోమీటర్లు, కాకినాడకు 620, మచిలీపట్నానికి 720, బాపట్లకు 790 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ, సోమవారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ‘తీవ్ర తుపాను’గా, మంగళవారం నాటికి ‘అత్యంత తీవ్ర తుపాను’గా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనం తరం వాయవ్య దిశగా పయనించి బుధవారం ఉదయానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమయంలో ఈదురు గాలుల వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని తెలిపారు. అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వరకూ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్రత పెరుగుతుందని తెలిపారు. మంగళవారం కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు సంభవించొచ్చని తెలిపారు. కృష్ణా, ఎన్‌టిఆర్‌, ఏలూరు, పశ్చిమగోదావరి, బాపట్ల, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, విశాఖ, అల్లూరి జిల్లాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో, అనకాపల్లి జిల్లాలో 29 తేదీ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు, అంగన్‌‌వాడీ కేంద్రాలకు కలెక్టర్‌ సెలవు‌ ప్రకటించారు. ఎచ్చెర్ల డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీకి మంగళ, బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్టు వైస్‌ ‌ఛాన్సలర్‌ కె.ఆర్.రజని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లోని ఉన్న బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. 27వ తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రజలు, పర్యాటకులు, సందర్శకులకు సముద్ర తీర ప్రాంతాల్లోకి అనుమతి లేదని ఎస్‌పి ఒక ప్రకటనలో వెల్లడించారు.

విశాఖ, కాకినాడ జిల్లాలో ఉప్పాడలో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌‌కు బోట్లను మత్స్యకారులు చేర్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్