బ్రెజిల్ అధ్యక్షుడిగా నాల్గో పర్యాయం ఎన్నిక
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన అభినందనలు
బ్రసిలియా : బ్రెజిల్ ఎన్నికలలో వామపక్ష నేత, వర్కర్స్ పార్టీ అధినేత లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఘన విజయం సాధించారు. దీంతో బ్రెజిల్ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. వర్కర్స్ పార్టీ జెండాలు, లూలా టీ షర్టులతో యువత రోడ్ల మీదకు వచ్చారు. సామ్రాజ్యవాదానికి, దోపిడి శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విజయంతో లూలా నాలుగో పర్యాయం బ్రెజిల్ అధ్యక్ష భాద్యతలు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి లూలాకు 51.76 శాతం ఓట్లు, ఆయన ప్రత్యర్థి ఫ్లావియో బొల్సోనారో 48.24 శాతం ఓట్లు సాధించారు. గెటులియో వర్గాస్ తర్వాత బ్రెజిల్ చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రెండో వ్యక్తిగా లూలా రికార్డు సృష్టించారు. లూలాకు 6.4 కోట్ల ఓట్లు వచ్చాయి. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
అబద్ధాలు ఓడిపోయాయి..
ఈ సందర్భంగా లూలా మాట్లాడుతూ.. అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణకు ఇది ఓటమి అని అన్నారు. బ్రెజిలియన్లందరి కోసం పోరాడతానని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని స్పష్టం చేశారు. సావోపాలోలోని ప్రసిద్ధ అవెనిడా పాలిస్టాలో అర్ధరాత్రి వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘బ్రెజిల్ ఎవరి పెరటి తోట కాదు’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నుద్ధేశించి అన్నారు. ఉద్వేగభరిత ప్రసంగంలో మహిళలు, వృద్ధ ఓటర్ల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. వీధుల్లో, సోషల్ మీడియాలో యువత చేసిన ప్రచారాన్ని ప్రశంసించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తమ ఓటు ఎంత కీలకమో వారికి చెప్పాం.. వారిని ఒప్పించగలిగాం కాబట్టే ప్రజలు ఓటు వేయడానికి తరలివచ్చారు’’ అని ఆయన అన్నారు. ఎన్నికల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతానని ప్రకటించారు. డిజిటల్ కమ్యూనికేషన్‌కు నాలుగో పర్యాయంలో మరింత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ‘‘ భవిష్యత్తు ఈ రోజే మొదలవుతుంది, దాని పేరు యువత. మార్పు తెచ్చిన మహిళలకు వందనం. త్యాగాలు చేసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పెద్దలకు వందనం’’ అని అన్నారు. భవిష్యత్ ప్రణాళికలను కూడా లూలా ప్రకటించారు. ‘‘ ఆరోగ్య వ్యవస్థకు నిధులు పెంచుతాం, దేశీయంగా కృత్రిమ మేధ (ఎఐ)ను అభివృద్ధి చేస్తాం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విస్తరణ కొనసాగిస్తాం, డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడతాం’’ అని చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది.
ఊహించని పునరాగమనం
లాటిన్ అమెరికా అంతటా కనిపిస్తున్న మితవాద శక్తుల ప్రభంజనానికి ఈ విజయం అడ్డుకట్ట వేసింది. ఈనెల 4న జరిగిన తొలి రౌండ్‌లో లూలా వెనుకబడ్డారు. ఆయనకు 45.16 శాతం చెల్లుబాటైన ఓట్లు రాగా, ఫ్లావియోకు 47.03 శాతం వచ్చాయి. దీంతో బోల్సోనారో కుటుంబం మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆందోళన యువతలో, ముఖ్యంగా ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, రవాణా విషయంలో బలంగా కనిపించింది. దీంతో లక్షలాదిమంది దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చారు. ఎక్కడి కక్కడ ర్యాలీలు నిర్వహించాకరు. లూలాకు మద్దతు ప్రకటించి ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలని కోరారు. తొలి రౌండ్ తర్వాత జరిగిన పరిణామాలు చారిత్రాత్మకంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ‘‘లూలా సైన్యం’’ పేరుతో విస్తృంగా ప్రచారం చేశారు. ఈ ఆన్‌లైన్ ఉద్యమానికి ఫెడరల్ డిప్యూటీ ఆండ్రే జనోన్స్ నాయకత్వం వహించారు. అయితే ఆయన వర్కర్స్ పార్టీ సభ్యుడు కాకపోవడం గమనార్హం. ‘‘లూలా సైన్యం’’ పేరుతో వాట్సాప్ ఛానల్ ప్రారంభించి, కోటికి పైగా సబ్‌స్క్రైబర్లను పెంచారు. అంతేకాకుండా వారికి ప్రతిరోజూ రీచ్ కోసం టార్గెట్‌లు ఇచ్చారు. అనిశ్చితంగా ఉన్నవారిని, తొలి రౌండ్‌లో ఓటు వేయనివారిని ఒప్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇతర అభ్యర్థులకు తొలి రౌండ్‌లో ఓటు వేసినవారిని ఒప్పించేందుకు లూలా యువ మద్దతుదారులు, వారిలో చాలామంది టీనేజర్లు, ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో గైర్హాజరు శాతం 2002 తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయింది. లూలా ప్రచారానికి పెద్ద సవాలు కూడా ఎదురైంది. మెటా నుంచి ఎక్స్, గూగుల్ వరకు బిగ్ టెక్ సంస్థలు బహిరంగంగా ఫ్లావియో ప్రచారానికి మద్దతిచ్చాయని, లూలా ప్రకటనలను నిలిపేశాయని వర్కర్స్ పార్టీ నేతలు తెలిపారు. ఈనెల 16న బ్రెజిల్ మీడియా బయటపెట్టిన కథనం తర్వాత, లూలా ప్రచార కంటెంట్‌ను రూపొందించకుండా తమ కృత్రిమ మేధ (ఎఐ) సాధనం అడ్డుకుందని, అదే సాంకేతికతను ఫ్లావియో ప్రచారం వాడుకోవడానికి అనుమతిం చామని మెటా అంగీకరించింది.
ట్రంప్ అక్కసు
ఈ ఎన్నికల్లో ఫ్లావియో బొల్సనారా గెలుపొందుతారని, ఆయనే బ్రెజిల్ తదుపరి అధ్యక్షుడని ట్రంప్ పదేపదే చెప్పారు. ఫలితం వెలువడిన తర్వాత లూలా విజయాన్ని ఆయన ఖండించారు. 2020లో తాను జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ఉదంతంతో పోలుస్తూ, బ్రెజిల్ ‘జో బైడెన్ ప్లేబుక్’ను అనుసరించిందని అక్కసు వెళ్లగక్కారు. ‘‘తొలి రౌండ్‌లో బోల్సోనారోకు పెద్ద ఆధిక్యం ఉంది, రెండో రౌండ్‌లో కూడా ఆయనే స్పష్టమైన ఫేవరెట్. ’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఓడిపోయిన ఫ్లావియో కూడా ఫలితాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. ఎన్నికను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు మార్చేసిందని ఆయన ఆరోపించారు.
ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలో వరుసగా నాలుగోసారి విజయం సాధించి రికార్డు సృష్టించిన లూలాను అభినందిస్తూ ప్రపంచ నేతలు సందేశాలు పంపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లూలా విజయంపై స్పందిస్తూ ‘రీ ఎన్నికల్లో అద్భుత విజయం’ అని అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఇరు దేశాల మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, విస్తరించడానికి లూలాతో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని మోడీ తెలిపారు. భారత్- బ్రెజిల్ కలిసి విభిన్న రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, గ్లోబల్ సౌత్ యొక్క ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడం, మరింత సమ్మిళిత, సమానమైన- సుస్థిరమైన ప్రపంచం కోసం కృషి చేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. అలాగే, 'లాంగ్ లివ్ డెమొక్రసీ...ఇది బ్రెజిల్ ప్రజల విజయం' అని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ వ్యాఖ్యానించారు. లూలా నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నే ఆకాంక్షించారు. లూలా చారిత్రక విజయంతో బ్రెజిల్‌లో శాంతి, సార్వభౌమత్వం, సామాజిక న్యాయం వర్థిల్లుతాయని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్-కానెల్ తెలిపారు. చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్ ఫోన్‌లో లూలాకు అభినందనలు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా కలసి పోరాడదామని చెప్పారు. 'మన వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకారం, అభివృద్ధిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అని పెరూ అధ్యక్షుడు ఫుజిమోరీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి రెండు దేశాలు కలసి పనిచేస్తాయని బలీవియా అధ్యక్షుడు రోడ్రియో పాజ్ చెప్పారు. ఉమ్మడి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు. రెండు దేశాలు కలసి పని చేయాలని పనామా అధ్యక్షుడు జోస్ రాల్ ములినో ఆకాంక్షించారు. బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి శత్రువులు, సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో కలసికట్టుగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని ఈక్వెడార్ అధ్యక్షుడు డేలియల్ నొబోవా అభిప్రాయపడ్డారు. పరాగ్వే, ఉరుగ్వే, అర్జెంటీనా నేతలు కూడా లూలాను అభినందిస్తూ సందేశాలు పంపారు. కాగా, లూలా విజయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ఈ ఫలితాన్ని విమర్శిస్తూ పోలింగ్ సమయాన్ని పొడిగించడాన్ని తప్పుపట్టారు. అయితే లూలా విజయాన్ని ప్రగతిశీల సెనెటర్ శాండర్స్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్వాగతించారు.
కార్మిక నేతగా లూలా
బ్రెజిల్ ప్రజలతో లూలా మమేకం
లూలా
క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోతో లూలా
ఫ్యాక్టరీ కార్మికుడిగా ప్రమాదంలో చిటికెన వేలును కోల్పోయిన లూలా







కామెంట్‌లు (0)