విరుచుకుపడుతున్న ‘అర్నబ్’
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
విరిగిపడిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు, కొమ్మలు
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
విశాఖ జిల్లాలో 12 సెంటీమీటర్ల సగటు వర్షపాతం
నగరంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి
ప్రజాశక్తి- యంత్రాంగం : అర్నబ్ తుపాను విరుచుకుపడుతుండడంతో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలు చిరుగుటాకుల్లా వణుకుతున్నాయి. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు బలమైన ఈదురు గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు తగ్గిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో, పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో ఉండపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి తుపాను ప్రభావం కనిపించింది. యానాంలో సాయంత్రం ఐదు గంటల తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం కురింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. యానాం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మద్యం షాపులు, హోటళ్లు ఇతర దుకాణాలను మూయించేశారు. రోడ్లపై ఎవరినీ తిరగనీయకుండా చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా రాత్రి ఏడు గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామచంద్రపురం, సఖినేటిపల్లి, మలికిపురం, ఉప్పలగుప్తంలో భారీ వర్షం పడింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా రాత్రి ఏడుగంటల వరకూ సగటున 23.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. యానాంతో పాటు కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు చాలావరకూ నిలిచిపోయాయి. కాకినాడ జిల్లాలో కాకినాడ, యు.కొత్తపల్లి, తొండంగి, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుని నుంచి అంతర్వేది వరకూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బీచ్ రోడ్డుపైకి ఎగిసి పడుతున్న అలల ధాటికి పెద్దపెద్ద బండరాళ్లు సైతం ఎగిరిపడుతుండడంతో రాకపోకలను నిలిపేశారు. మాయాపట్నం సముద్రకోతకు గురై గ్రామంలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి, తొండంగి మండలం పెరుమాళ్లపురం, కోనసీమ జిల్లా అల్లవరం మండ లంలో ఓడలరేవు, మలికిపురం మండలం అంతర్వేది వద్ద సముద్రం 150 నుంచి 180 మీటర్లు ముందుకు వచ్చింది. కాకినాడ రూరల్ మండలం, కరప, యు.కొత్తపల్లి, యానాం, తాళ్లరేవు, తొండంగి, తుని మండలాల్లో రాత్రి ఏడు గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

విశాఖ నగరం ఒక్కరోజులో అతలాకుతలమైంది. నగరంలో భారీ వర్షం కురిసింది. రోజంతా ఈదురు గాలులు వీచాయి. విశాఖ జిల్లాలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇక్కడే అధికంగా కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుపాను బీభత్సంతో దువ్వాడ సమీపంలోని మంగళపాలెంలో విద్యుత్ వైర్లు తెగి నీటిలో పడ్డాయి. అటుగా వెళ్లిన అమరపిన్ని దేవుడు (65) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎగసి పడిన అలలతో రుషికొండ, భీమిలి, సాగర్‌నగర్, ఆర్‌కె బీచ్‌ల్లో సముద్రం ముందుకొచ్చింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గాజువాక సహా పలు ప్రాంతాల్లో గాడాంధకారం నెలకొంది. గొంతువానిపాలెం వద్ద ప్రభుత్వ పాఠశాల గోడపై చెట్టు విరిగిపడింది. పాఠశాలకు సెలవు కావడంతో ప్రాణాపాయం తప్పింది.
విశాఖ జిల్లా ఆర్‌టిసి అధికారులు 160 బస్సు సర్వీసులను రద్దు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే విశాఖ మీదుగా వెళ్లే 54 రైళ్లు రద్దయ్యాయి. విశాఖ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద సూచిక ఎగరవేశారు. అనకాపల్లి జిల్లా అంతటా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో అత్యధికంగా 83.14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉద్దాన, తీర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు నేలవాయి. శ్రీకాకుళం ఆర్‌టిసి కాంప్లెక్సును వర్షపు నీరు ముంచెత్తింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మంగళవారం వేకువ జాము నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. గాలులకు పలుచోట్ల వరి చేలు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మరోవైపు చెరువులు, జలాశయాల్లో భారీగా నీరు చేరింది. వంగర మండలంలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డవలస ప్రాజెక్టు ఐదు ప్రధాన గేట్లు ఎత్తి 15,600 క్యూ సెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తివేయడం, వీరఘట్ట మండలం వైపు నుంచి వస్తున్న ఒట్టిగడ్డ లో నీరు నాగావళి నదిలో చేరుతుండడంతో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తుపాను ప్రభావంతో ముక్కాం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. బాపట్ల జిల్లాలో చలి గాలులు వీస్తున్నాయి. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్‌లో 8వ నంబరు ప్రమాద హెచ్చరిక సూచికను ఎగురవేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సముద్రపు కెరటాలు ఎగసిపడ్డాయి. అల్లూరి, పోలవరం జిల్లాల్లోనూ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాల్లో ముసురు వాతావరణం నెలకొంది.
గన్నవరం, భోగాపురంలో పలు విమాన సర్వీసులు రద్దు
తుపాను కారణంగా ప్రతికూల వాతావరణం నెలకొనడంతో విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులను ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఫ్లై91 సంస్థలు మంగళ, బుధవారాల్లో నిలిపివేశాయి. దీంతో, కడప, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే విమాన ప్రయాణికులపై ఈ ప్రభావం పడింది. భోగాపురం విమానాశ్రయానికి కూడా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.







కామెంట్‌లు (0)