న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అభిషేక్ పరుగుల వరద పారించగా.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అతడికి సహకారం అందించాడు.
సరికొత్త ప్రపంచ రికార్డు
ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.
కాగా వెల్లింగ్‌టన్ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది.
15 బంతుల్లోనే అర్ధ శతకం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ కూడా ధనాధన్ దంచికొట్టాడు. పవర్ ప్లే అంటే.. ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి అభిషేక్ 20 బంతుల్లో 67, వైభవ్ 17 బంతుల్లో 44 పరుగులు సాధించారు. ఈ క్రమంలో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు సాధించింది. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 45 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 43 బంతుల్లో 133 పరుగుల జోడించారు. ఓపెనర్ల అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఈ మ్యాచ్‌లో కేవలం 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. శతక వీరుడు అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతర్జాతీయ టి20 పవర్ ప్లేలో అత్యధిక స్కోర్లు
118/0 : భారత్; న్యూజిలాండ్‌పై, వెల్లింగ్టన్-2026
116/0 : రొమేనియా; సెర్బియాపై, సోఫియా-2021
113/1 : ఆస్ట్రేలియా; స్కాట్లాండ్‌పై, ఎడిన్‌బర్గ్-2024
103/1 : జింబాబ్వే; నైరోబిపై, గాంబియా-2024
102/0 : దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌పై, సెంచూరియన్-2023







కామెంట్‌లు (0)