జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 15-49 మధ్య వయస్సు ఉన్న మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనత ( ఎనీమియా)తో బాధపడుతున్నారు. వీరిలో 52.2 శాతం మంది గర్భిణీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరన్ లోపం ఎక్కువగా ఉండటం, రుతుక్రమంలో అధిక రక్తస్రావం జరగడం, పోషకాహార లోపం వంటి పలు కారణాల వలన మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రాత్రి పగలు ఇంటి పనులతో సతమతం అవుతున్న మహిళలు, చదువుకునే బాలికలు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు తరచూ అలసటకు గురవతూ కొన్ని సందర్భాల్లో కళ్ళు తిరిగి పడిపోవడం, ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా ఉండటం వంటివి సంభవించడానికి ప్రధాన కారణం ఐరన్ లోపం, రక్తహీనత. మహిళలు ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు, వైద్యుని సలహా మేరకు మందులు, మొలకెత్తిన గింజలు, విటమిన్ సి, తగినంత మాంసాహారం, పప్పుదినుసులు తీసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భిణీలు పోషకాహారంతోపాటు శారీరక మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయాలి. పోషకాహారం ద్వారానే రక్తహీనత అరికట్టవచ్చనే వాస్తవాన్ని మరువరాదు. ముఖ్యంగా రుతుక్రమం సందర్భంగా వచ్చే సమస్యల పరిష్కారం కోసం, గర్భిణీలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. సమీప అంగన్వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిని సంప్రదించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి.
- ఐ.ప్రసాదరావు,
సెల్:9390509791







కామెంట్లు (0)