- తొలిరోజు డిఎస్సిపైనే
- మండలిలో చర్చకు వైసిపి పట్టు
- శాసనసభలో మంత్రి లోకేష్ వివరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో డిఎస్సి నియామకాలు, ఎల్‌నినో ప్రభావం, సాయికృష్ణ లాకప్ డెత్, బిసి రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక, పిపిపి విధానం వంటి పలు అంశాలు కీలకం కానున్నాయి. శాసన సభ సమావేశాలు ఉదయం 9 గంటలకు పారంభంకానుంది, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంబమవుతుంది. శాసన సభ సమావేశాలకు వైసిపి ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతామని ఆ పార్టీ గతంలోనే ప్రకటించింది. దీంతో ఈ సారి కూడా వైసిపి ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. వైసిపి సభకు హాజరుకాకపోవడంపై అధికారపక్షం ఇరుకునపట్టే ప్రయత్నం చేస్తోంది. గత సమావేశాల్లో సభకు హాజరు కాకపోయినా కేంద్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాల్లో సభలోని చర్చకు వచ్చిన అంశాలపై తమ వాధనను వైసిపి ప్రజలకు వెల్లడించింది. ఈ సారి అదే విధానాన్ని పాటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. శాసన మండలిలో మాత్రం వైసిపి డిఎస్సి నియామాకాల్లో అవకతవకలు, ఎల్‌నినో ప్రభావంతో పంటలకు సాగునీరు అందకపోవడం, సాయికృష్ణ లాకప్ డెత్, నిరుద్యోగులకు భృతి, గిరిజనులకు సంబంధించి 1/70 చట్టం, జిఒ 3లతోపాటు 16 రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్సీలకు అధిష్టానం వ్యూహాలను రూపకల్పనకు దిశానిర్ధేశం చేయనుంది. డిఎస్సిపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో వివరణలు ఇప్పించిన ప్రభుత్వం, తాజాగా శాసన సభలో తొలి రోజే మంత్రి నారా లోకేష్‌తో వివరణ ఇప్పించేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రభుత్వం శాసన సభ వేదికగా తాము చేపట్టిన పథకాలకు, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. సభలో బిసి రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక, ‘నేతన్న సేవలో’ పథకం, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం, అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వాటర్లు ప్రభుత్వానికి అప్పగించడం, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, స్వర్ణగిరి బంగారం ఉత్పత్తి, పిపిపి విధానం ఇతర పలు అంశాలపై చర్చించి ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుంది. గ్రూప్ 1 నియామకాల్లో సిట్ నివేదిక, లిక్కర్ స్కాం, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ వైసిపిని ఇరుకున పెట్టేందుకు అధికారపక్షం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దిశా బిల్లు, విద్యుత్ శాసనములు సవరణ బిల్లు వంటి వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ బిల్లుల స్థానంలో కొత్త బిల్లులను తీసుకువచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లకు సంబంధించి అంశంపైన, స్థానిక సంస్థల చైర్మన్లు, అధ్యక్షులను ప్రత్యేక్షంగా ఎన్నుకునే అంశాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై తొలిరోజు నిర్వహించనున్న బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ సమావేశాలకు ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ప్రకటించాయి.
సర్వం సిద్ధం
అసెంబ్లీ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలకు సభ్యులడిగిన ప్రశ్నలకు అన్ని శాఖల నుంచి సమాధానాలు ముందుగానే రాబట్టేందుకు చర్యలు తీసుకున్నారు. సభా హామీల అమలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సభాపతి ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలో డిజిటల్ పాస్‌ల విధానం ఈ సమావేశాల నుంచి అమలు చేయబోతున్నారు. పాస్‌లను తప్పనిసరిగా స్కాన్ చేసి దృవీకరించుకున్న అనంతరమే సంబంధిత వ్యక్తులను ఆవరణలోకి అనుమతిస్తారు. శాసన సభ సమావేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. సిసి కెమెరాల వినియోగంతోపాటు అంసెంబ్లీ భవనం చుట్టు పోలీసుల పహారా, వాహనాల రాకపోకల నియంత్రణ వంటి చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ, గుంటూరుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరయ్యే మార్గాలలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
డిప్యూటీ చైర్మన్ ఎన్నిక?
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఈ సమావేశాల్లోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందకు సంబంధించి మండలిలో ఆధిపత్యం ఉన్న వైసిపి తన అభ్యర్ధిగా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసి పార్టీ ఎమ్మెల్సీలందరూ మాధవరావుకే పూర్తి మద్దతు ఇవ్వాలని ప్రకటించారు. 6 గురు ఎమ్మెల్సీలు పార్టీ నుంచి బయటకు వచ్చినా స్పష్టమైన మెజారిటీ వైసిపికి కనిపిస్తోంది. దీంతో వైసిపి అభ్యర్ధే డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)