న్యూఢిల్లీ : కేంద్రం విధించిన యుపిఐ ఎండిఆర్ చార్జీలపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పన్ను లేదా రుసుము కాకుండా ఈ బలవంతపు స్వాధీనం ఏమిటని ప్రశ్నించింది. ఈ చార్జీలపై నాలుగు రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ చార్జీలపై మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించింది.
అసలు ఎండిఆర్ వాస్తవ రూపం ఏమిటని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.వెంకటరమణను ప్రశ్నించారు. ‘‘ఇది పన్ను కాదు, అలా అని రుసుము కూడా కాదు.. మరి ఈవిధంగా బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సి అత్యవసర పరిస్థితి ఏమిటి’’ అని జస్టిస్ బాగ్చి ప్రశ్నించారు. వ్యాపారులు రూ.2,000కు మించిన కొన్ని యుపిఐ చెల్లింపులపై 0.4శాతం ఎం.డి.ఆర్ విధించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండిఆర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అంజన్ దత్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన 'పర్సన్-టు-మర్చెంట్' (పి2ఎం) యుపిఐ లావాదేవీలపై 0.4శాతం ఎండిఆర్ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం.. రూ.75,000 అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఈ ఎండిఆర్ గరిష్టంగా రూ.300గా నిర్ణయించింది.







కామెంట్‌లు (0)