దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రజాశక్తి - విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పదంగా మృతి చెందిన టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె భర్త శ్రీచరణ్‌పై అక్కడి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాధా గాయత్రిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసి, అల్లుడే చంపేసినట్టు మృతురాలి తండ్రి సుధాకర్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధాగాయత్రి ఇటీవల ఉత్తరాఖండ్‌లో టూర్‌కి వెళ్లారు. ఈ నెల 14న ముస్సోరీలో హోమ్‌స్టేలో ఉన్నారు. అక్కడ రాధా గాయత్రి మృతి చెందారు. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొలి నుంచీ అనుమానాలు రేగుతున్నాయి. ‘పూర్తిస్థాయి విచారణ చేసి మాకు న్యాయం చేయండి’ అంటూ మృతురాలు రాధా గాయత్రి తండ్రి సుధాకర్ కోరుతున్నారు. రాధాగాయత్రి, శ్రీచరణ్‌లకు గతేడాది నవంబరులో వివాహం జరిగింది. వారి కుటుంబీకులు విశాఖలోని సింహాచలం సమీప ప్రాంతంలో ఉంటున్నారు.








కామెంట్‌లు (0)