- బముటియాలోని కాళీబజార్‌లో మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింత
- ఖండించిన సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేంద్ర చౌధరి
అగర్తలా : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కారుపై బిజెపి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆదివారం పశ్చిమ త్రిపుర బముటియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్‌ఐ) మోహన్‌పూర్ డివిజనల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళుతున్న మాణిక్ సర్కార్‌ను కాళీబజార్ వద్ద ఒక దుండగులు అడ్డుకుని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో మాణిక్ సర్కార్ కాన్వాయ్ కాళీబజార్‌కు చేరుకోగానే, నిరసనకారులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టి, వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. బముటియా నుంచి సిపిఎం ఎమ్మెల్యే నయన్ సర్కార్ మాట్లాడుతూ, బిజెపి కార్యకర్తలు అకస్మాత్తుగా కాన్వాయ్‌ను నిలిపివేసి, ఎస్కార్ట్ వాహనాలను ధ్వంసం చేసి, మాణిక్ సర్కార్ కారుపై గుడ్లు విసిరారని తెలిపారు. ఈ దాడి వెనుక బిజెపి మాజీ ఎమ్మెల్యే కృష్ణధన్ దాస్, స్థానిక మండల అధ్యక్షుడు నేతృత్వం వహించారని సిపిఎం నాయకులు తెలిపారు.
మహాసభకు అంతరాయం కలిగించేందుకు యత్నించిన మూకను డిఐవైఎఫ్‌ఐ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు ప్రతిఘటించడంతో వారు చెల్లాచెదురయ్యారు. అనంతరం యువజన కార్యకర్తలు మాణిక్ సర్కార్‌ను సురక్షితంగా కార్యక్రమ వేదికకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే భారీ పోలీసు, సిఆర్‌పిఎఫ్ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అనంతరం మాణిక్ సర్కార్ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన సురక్షితంగా అగర్తలాకు తిరిగి వెళ్లారు.
ప్రజలు ఎదురుతిరిగితే బిజెపి నాయకులు ఎక్కడా దాక్కోలేరు : జితేంద్ర చౌధరి
ఈ ఘటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌధరి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకునేందుకు జరిగిన ఈ ఉద్దేశపూర్వక యత్నాన్ని ఆయన ఖండించారు. ఈ నిరసనలను ప్రోత్సహించిన బిజెపి నేతలు, ప్రజలు వీధుల్లోకి వచ్చిన తర్వాత దాక్కోలేరని ఆయన హెచ్చరించారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇన్‌ఛార్జి) జిఎస్ రావుతో మాట్లాడానని, పూర్తి విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు జితేంద్ర చౌధురి తెలిపారు.







కామెంట్‌లు (0)