- నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రారంభించనున్న సిఎం, డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పల్లె పండగ మూడవ దశలో భాగంగా మొత్తం రూ.11,085 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పల్లె పండగ మూడవ దశలో భాగంగా చేపట్టనున్న ప్రధాన పనులు, రూ.2,700 కోట్ల వ్యయంతో 6 వేల కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణం, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు, రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22 వేల మినీ గోకులాల నిర్మాణం, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టనున్నారు. రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం. రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.5,694 కోట్లు కలిపి మొత్తం రూ.11,085 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విబి గ్రామ్ జి కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ తదితర నిధుల ద్వారా మరో రూ.2 వేలకోట్లతో పనులు చేపట్టనున్నట్లు పేర్కొంది. పల్లె పండగ మొదటి దశలో భాగంగా 4 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,514 పశువుల షెడ్లు, 21 వేల వ్యవసాయ పంట కుంటలు నిర్మించడంతో పాటు 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకాన్ని చేపట్టినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తెలిపింది. పల్లె పండగ రెండవ దశలో 2,500 కిలోమీటర్ల సిసి రోడ్లు, 8,300 కిలోమీటర్ల బిటి రోడ్లు, 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అదనంగా 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, పారిశుధ్యం, పశుసంవర్ధక రంగం, ఉద్యానవనం, ప్రజా మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పల్లె పండగ 3.0 కింద రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.







కామెంట్‌లు (0)