గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెంగళూరు పబ్ వివాదం – ఐఎఎస్ వికాస్ మర్మత్ బదిలీ

1 గంట క్రితం

Bengaluru Pub Controversy – IAS Officer Vikas Marmat Transferred
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సంచాలకుడు, ఐఎఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ పబ్‌ లో పోలీసులతో వాగ్వాదానికి దిగి, వివాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఎఎస్ అధికారి వికాస్ మర్మత్‌ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వికాస్ మర్మత్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఆయన్ను తక్షణమే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారి బహిరంగ ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని ఓ పబ్‌లో అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి మైనర్లకు మద్యం సరఫరా కాకుండా అరికట్టేందుకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఎంక్వైరీ వింగ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే బృందం వయస్సు ధ్రువీకరణ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అక్కడున్న యువతుల ఐడీ కార్డులను పోలీసులు అడగడంపై వికాస్ మర్మత్, ఆయన ముగ్గురు స్నేహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తానొక ఐఎఎస్ అధికారిని అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని దూషించడంతో పాటు వారిపైకి తోపులాటకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వికాస్ మర్మత్‌తో పాటు ఆయన ముగ్గురు స్నేహితులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, విధులను అడ్డుకోవడం, నేరపూరిత బెదిరింపులు, దుర్భాషలాడటం వంటి తీవ్రమైన ఆరోపణలతో కేసులు నమోదు చేసి కర్నాటక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సివిల్ సర్వెంట్‌గా ఉండి ఇతర రాష్ట్రంలో పోలీసులపైనే దాడికి దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్ వివాదం పై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎంఒ ఆదేశించింది. క్రమశిక్షణారాహిత్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ప్రాథమిక చర్యగా ఆయనను కుప్పం పీడీ బాధ్యతల నుంచి తొలగించి జీఏడీకి అటాచ్ చేసింది. పూర్తి స్థాయి విచారణ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత వికాస్ మర్మత్‌పై సర్వీస్ నిబంధనల ప్రకారం మరిన్ని కఠిన శాఖాపరమైన చర్యలు, సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్