- డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అభ్యర్థిత్వానికి ముప్పు
- అక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవు
- ఎన్నికల మార్గదర్శకాలు విడుదల చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
ప్రజాశక్తి–మదనపల్లె టౌన్: త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు, ర్యాలీలు, రోడ్షోలు నిర్వహించాలంటే కనీసం 48 గంటల ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రచార వాహనాలకు అనుమతి పత్రాలు తప్పనిసరని, వేర్వేరు పార్టీల ర్యాలీలు ఒకే సమయంలో, ఒకే మార్గంలో నిర్వహించరాదని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైకులను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల సమీపంలోని నిశ్శబ్ద ప్రాంతాల్లో శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం నేరమని ఎస్పీ హెచ్చరించారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలించరాదని, విలువైన వస్తువుల రవాణాకు కూడా తగిన ఆధారాలు ఉండాలని తెలిపారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదు, వస్తువులను నిబంధనల మేరకు స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో లైసెన్సు కలిగిన ఆయుధాలను పోలీసులకు అప్పగించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రచారం, తప్పుడు సమాచారం, మార్ఫింగ్ చిత్రాలను ప్రచారం చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి వేదికలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిఘా ఉంటుంది.







కామెంట్లు (0)